బోడుప్పల్ సర్కిల్ శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి

by velandi.Saikiran |

బోడుప్పల్ లో బుధవారం కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, పౌర సదుపాయాలపై క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు.

బోడుప్పల్ సర్కిల్ శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి
X

దిశ , మేడిపల్లి: పరిశుభ్రమైన కాలనీల నిర్మాణం, పచ్చదనం పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బుద్ధనగర్ ప్రాంతంలో బుధవారం ఆయన ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, పౌర సదుపాయాలపై క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధనగర్ ప్రధాన రహదారిని పరిశీలించిన కమిషనర్, పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం, ఇంటింటా చెత్త సేకరణ సకాలంలో జరగకపోవడం, స్వీపింగ్ ద్వారా సేకరించిన వ్యర్థాలు రహదారులపై ఉండడం గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తూ పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని, ప్రతిరోజూ క్రమబద్ధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇంటింటా చెత్త సేకరణను నిర్దేశిత సమయానికి పూర్తి చేయడంతో పాటు, స్వీపింగ్ ద్వారా సేకరించిన వ్యర్థాలను రహదారులపై వదిలిపెట్టకుండా వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం బుద్ధనగర్ కాలనీ రోడ్ నెం.4లో పట్టణ హరితీకరణ కార్యక్రమాలను పరిశీలించిన కమిషనర్, అర్బన్ బయోడైవర్సిటీ (యూబీడీ) విభాగం పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటి ముందు ఏర్పాటు చేసిన ప్లాంటర్ బాక్స్‌లను సక్రమంగా సంరక్షించేలా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయడం, కలుపు మొక్కలను తొలగించడం, కొమ్మల కత్తిరింపు, మొక్కల సంరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఇంటింటా చెత్త సేకరణ నిర్వహించే శానిటేషన్ సిబ్బంది ప్లాంటర్ బాక్స్‌లలో ప్లాస్టిక్ లేదా ఇతర వ్యర్థాలు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, అలాగే ప్లాంటర్ బాక్స్‌లను నిరంతరం పరిశీలిస్తూ పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.పరిశుభ్రమైన, పచ్చదనం నిండిన కాలనీల నిర్మాణం కేవలం మున్సిపల్ యంత్రాంగం బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ మొక్కలను సంరక్షిస్తేనే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందరికీ అందించగలమని కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి పేర్కొన్నారు. అధికారులు, శానిటేషన్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ పారిశుద్ధ్య ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలని ఆయన ఆదేశించారు.

Next Story