- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'దిశ' ఎఫెక్ట్..నారపల్లి సబ్ రిజిస్ట్రార్‌పై వేటు..
జిల్లాలో భూబకాసురులకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతున్న అవినీతి అధికారులపై ఎట్టకేలకు కొరడా ఝుళిపింది.

దిశ, మేడ్చల్ బ్యూరో: జిల్లాలో భూబకాసురులకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతున్న అవినీతి అధికారులపై ఎట్టకేలకు కొరడా ఝుళిపింది. కొర్రెముల భూకుంభకోణంలో కీలక పాత్ర పోషించిన నారపల్లి సబ్ రిజిస్ట్రార్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. 'దిశ' దినపత్రిక ప్రచురించిన వరుస కథనాలతో మేల్కొన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు.. లోతైన విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆధారాలతో వరుస 'దిశ' కథనాలు
పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రెముల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 867 సహా పలు సర్వే నెంబర్లలో ఉన్న రూ. వందల కోట్ల విలువైన 150 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములకు యథేచ్ఛగా సేల్ డీడ్స్ జరుగుతున్న వైనాన్ని 'దిశ' దినపత్రిక సవివరంగా వెలుగులోకి తెచ్చింది. "సర్కారీ భూమికి సేల్ డీడ్స్!", " '9 జీ'.. ఒరిజినలేనా?" వంటి పతాక శీర్షికలతో కబ్జాదారుల బాగోతాన్ని బట్టబయలు చేసింది. నిద్రావస్థలో ఉన్న వ్యవస్థను మేల్కొల్పి, ప్రభుత్వ భూముల రక్షణలో ఈ కథనాలు క్రియాశీలకంగా పనిచేయడంతో రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వెంటనే అప్రమత్తమయ్యారు.
ఆధారాలతో సహా దొరికిన అక్రమాలు
దిశ కథనాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి లేఖ రాయడంతో విచారణ వేగవంతమైంది. జిల్లా రిజిస్ట్రార్ కు అందిన ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో భారీ అక్రమాలు నిర్ధారణ అయినట్లు తెలిసింది. ముఖ్యంగా ఎప్పుడో చనిపోయిన వ్యక్తి (రంగారావు) పేరిట డాక్యుమెంట్ నెంబర్ 2875/2026 ద్వారా స్మశానం నుంచి తీసుకొచ్చి వేలిముద్రలు వేయించినట్లుగా దొంగ రిజిస్ట్రేషన్ చేయడం, అసలు లేఅవుట్ లోనే లేని ప్లాట్లకు (డాక్యుమెంట్ నంబర్లు 4436 నుంచి 4442 వరకు) అక్రమంగా బౌండరీలు, సర్వే నెంబర్లు మార్చి, పక్క ప్లాట్ల జీపీఏలతో సేల్ డీడ్స్ చేయడం, రద్దయిన పాత ఆర్డీవో ఉత్తర్వులు, నకిలీ '9 జీ' సర్టిఫికెట్లతో నిషేధిత జాబితాలోని భూములను యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ చేయడం వంటి భారీ అక్రమాలు జరిగాయి. ఈ పక్కా ఆధారాలతో నారపల్లి సబ్ రిజిస్ట్రార్ బాగోతం విచారణలో రుజువు కావడంతో సస్పెన్షన్ కు మార్గం సుగమమైంది.
కొనసాగుతున్న ప్రక్షాళన
ఇప్పటికే అవినీతి, అక్రమాల ఆరోపణలపై మేడ్చల్, బాచుపల్లి సబ్ రిజిస్ట్రార్లపై ఉన్నతాధికారులు వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా నారపల్లి ఎస్ఆర్ఓ పై కూడా సస్పెన్షన్ వేటు పడటంతో అక్రమాలకు పాల్పడే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వందల కోట్ల ప్రభుత్వ భూములను కాపాడటంలో 'దిశ' చేసిన అక్షర పోరాటం ఫలించిందని, ఇకపై పీఓబీ భూములపై కన్నేస్తే సహించేది లేదని తాజా చర్యలతో ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది.






