బదిలీ ఉత్తర్వులను విస్మరించిన డిప్యూటీ కమిషనర్ సస్పెండ్

by Ratna Kumari |

దిశ, మేడ్చల్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బదిలీ ఉత్తర్వులను అమలు చేయకుండా విధులకు

బదిలీ ఉత్తర్వులను విస్మరించిన డిప్యూటీ కమిషనర్ సస్పెండ్
X

దిశ, మేడ్చల్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బదిలీ ఉత్తర్వులను అమలు చేయకుండా విధులకు హాజరుకాని డిప్యూటీ కమిషనర్‌పై జీహెచ్ఎంసీ కఠిన చర్యలకు దిగింది. బదిలీ అయిన స్థానంలో బాధ్యతలు స్వీకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిప్యూటీ కమిషనర్ వి. శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ బల్దియా కమిషనర్ ఆర్.వి. కర్నన్ఆ దివారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అల్వాల్ సర్కిల్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని కవాడిగూడ సర్కిల్‌కు బదిలీ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. తక్షణమే కొత్త బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. ఆయన వాటిని పాటించకపోవడం అధికారుల దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్ ఆర్.వి. కర్నన్, పరిపాలనా క్రమశిక్షణ దృష్ట్యా విచారణ పూర్తయ్యే వరకు శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లా డిపార్ట్‌మెంట్ నుంచి డిప్యూటేషన్‌పై జీహెచ్ఎంసీ లో పని చేస్తున్న ఆయన పై శాసన విచారణ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

మొదటి నుంచే వివాదాలే

సస్పెన్షన్‌కు గురైన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిపై గతం నుంచే పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. అల్వాల్ సర్కిల్‌లో పనిచేసిన సమయంలో ఖాళీ స్థలాలకు పెద్ద సంఖ్యలో ఇంటి నెంబర్లు మంజూరు చేశారనే ఆరోపణలపై ఆయన విజిలెన్స్ విచారణను ఎదుర్కొన్నట్లు తెలిసింది. అదేవిధంగా, ఓ సీనియర్ సిటిజన్‌కు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ వ్యవహారంలో తన పరిధిని మించి వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై బాధితుడు బల్దియా ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. ఇక మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం శ్రీనివాస్ రెడ్డిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలను ఉద్దేశపూర్వకంగా ఇవ్వకుండా దాచిపెట్టడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అలాగే ప్రోటోకాల్ అంశాల్లో కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటూ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Next Story