కామ్రెడ్ వీ.వీ.ఎస్ మూర్తి మ‌ర‌ణం కార్మిక లోకానికి తీర‌ని లోటు : సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యుడు వీ.ఎస్. బోస్

by Ratna Kumari |

ఏఐటీయూసీ సీనియ‌ర్ నేత‌, కార్మిక వ‌ర్గ హ‌క్కుల కోసం జీవితాంతం పోరాడిన కామ్రెడ్ వీ.వీ.ఎస్. మూర్తి మ‌ర‌ణం కార్మిక లోకానికి తీర‌ని లోట‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యుడు వీ.ఎస్. బోస్ పేర్కొన్నారు.

కామ్రెడ్ వీ.వీ.ఎస్ మూర్తి మ‌ర‌ణం కార్మిక లోకానికి తీర‌ని లోటు :  సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యుడు వీ.ఎస్. బోస్
X

దిశ‌, కాప్రా : ఏఐటీయూసీ సీనియ‌ర్ నేత‌, కార్మిక వ‌ర్గ హ‌క్కుల కోసం జీవితాంతం పోరాడిన కామ్రెడ్ వీ.వీ.ఎస్. మూర్తి మ‌ర‌ణం కార్మిక లోకానికి తీర‌ని లోట‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యుడు వీ.ఎస్. బోస్ పేర్కొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో శనివారం ఈసీఐఎల్ లోని సీపీఐ కార్యాలయం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా వీ.ఎస్. బోస్ మాట్లాడుతూ వీ.వీ.ఎస్ మూర్తి 83 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో గుండెపోటుతో క‌న్ను మూయడం కార్మిక‌, ప్ర‌జాస్వామిక ఉద్యమాలకు తీరని లోటన్నారు. టెలికమ్యూనికేషన్ శాఖలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన, ఉద్యోగ జీవితంతో పాటు కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించారన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా కార్మిక ఉద్యమాలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తుచేశారు.


బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం, పోస్టల్ అండ్ టెలికాం ఉద్యోగుల సమాఖ్య, ఏఐటీయూసీ వంటి అనేక కార్మిక సంఘాలలో కీలక బాధ్యతలు నిర్వహించి వేలాది మంది కార్మికులకు మార్గదర్శకుడిగా నిలిచారని, కార్మిక సమస్యలపై ఆయన రాసిన వ్యాసాలు, సంపాదకత్వం వహించిన "కార్మిక బాట" పత్రిక ద్వారా కార్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో విశేష కృషి చేశారన్నారు. సామాజిక సేవ పట్ల తన నిబద్ధతను చివరి క్షణం వరకు కొనసాగించిన మూర్తి తన భౌతిక దేహాన్ని వైద్య విద్య, పరిశోధనల కోసం గాంధీ మెడికల్ కళాశాలకు దానం చేయడం ఆయన గొప్ప మానవతా విలువలకు నిదర్శనమన్నారు . కామ్రేడ్ వి.వి.ఎస్. మూర్తి జీవితం యువతకు, కార్మిక ఉద్యమ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్మిక వర్గ విముక్తి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. సీపీఐ తరఫున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర, సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్ రావు, సీపీఐ నియోజకవర్గ నేతలు నారా నర్సింహా, నర్సింహా రావు,మల్కయ్య, మూర్తి, సుదర్శన్, సాయి, కిరణ్ పాల్గొన్నారు.

Next Story