కమర్షియల్ బిల్డింగులపై ప్రేమ.. పేదల ఇండ్లపై విషం..

by Naga Rani Yarlagadda |

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాపై ఓవైపు ప్రశంసలు కురుస్తుంటే.. మరోవైపు విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

కమర్షియల్ బిల్డింగులపై ప్రేమ.. పేదల ఇండ్లపై విషం..
X

దిశ, మేడ్చల్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాపై ఓవైపు ప్రశంసలు కురుస్తుంటే.. మరోవైపు విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా వెలిసిన పేదల ఇండ్లను కూలుస్తున్న హైడ్రా.. అదే విధంగా వెలిసిన వాణిజ్య సముదాయాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారం గ్రామరెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చిన హైడ్రా ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూమిని సంరక్షించింది. ఈ విషయంలో హైడ్రా పనితీరును అభినందించాల్సిందే. కానీ, కేవలం కొద్దిపాటి గజాల స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన హైడ్రా అధికారులు.. అదే ప్రభుత్వ స్థలాల్లో ఎకరాల్లో నిర్మించిన కమర్షియల్ భవనాల జోలికి ఎందుకు వెళ్లడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గాజులరామారం సర్వేనెంబర్ 13లో గల ప్రభుత్వ భూమిలో కెవీఎస్ కన్వెన్షన్, సర్వేనెంబర్ 127 ప్రభుత్వ భూమిలో తత్వ గ్లోబల్ స్కూల్ పేరిట కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ రెండింటి విషయంలో హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నలతో పాటు త్వరగా చర్యలకు దిగాలని డిమాండ్‌లు సైతం వినిపిస్తున్నాయి.

15 ఎకరాల భూమి సేఫ్..

కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం గ్రామరెవెన్యూ పరిధిలో రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణలపై 2024 ఆగస్టు నెలలో హైడ్రా ఫోకస్ పెట్టింది. సర్వేనెంబర్ 329లోని చింతలచెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌తో పాటుగా 329/1లో ఉన్న ప్రభుత్వ భూమిలో సైతం భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్టు గుర్తించింది. 2024 ఆగస్టు 6న వాటిని కూల్చివేసింది. ఇరిగేషన్ అధికారి నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అదేవిధంగా సర్వేనెంబర్ 354లో 15 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని సైతం హైడ్రా కాపాడింది. తాజాగా ఆదివారం సర్వేనెంబర్ 307లో వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను సైతం కూల్చివేసింది. రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించడంతో హైడ్రాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కెవీఎస్.. తత్వ గ్లోబల్ స్కూల్‌పై చర్యలేవి?

2025 ఏప్రిల్ నెలలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెవెన్యూ అధికారులతో కలిసి గాజుల రామారంలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఇదే క్రమంలో హైడ్రా అధికారులు సర్వే నెంబరు 12, 13, 127లలో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై అరా తీశారు. ఈ భూమిని కబ్జా చేసి కెవీఎస్ కన్వెన్షన్(కార్పొరేట్ ఫంక్షన్ హాల్‌), తత్వగ్లోబల్ స్కూల్ పేరిట భారీ భవనాలు వెలిశాయి. ఈ రెండు వాణిజ్య భవనాల్లో ఏటా రూ.కోట్లలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కొందరు భూ కబ్జాదారులు అపార్ట్మెంట్‌లు, ఇండిపెండెంట్ భవనాలను సైతం నిర్మించారు. కెవీఎస్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులను హైడ్రా అధికారులు పలుమార్లు ఆఫీసుకు పిలిపించుకొని మరీ వారి వద్దనున్న పత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత ఏమైందో తెలీదు. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిలో వందల కోట్లల్లో లావాదేవీలు నిర్వహిస్తున్న ఫంక్షన్ హాల్, కార్పొరేట్ స్కూల్ విషయంలో మాత్రం హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసిన హైడ్రా ప్రభుత్వ భూమిలో వెలిసిన కెవీఎస్ కన్వెన్షన్, తత్వ గ్లోబల్ స్కూల్ వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉందని, ఆ రెండింటిపై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నదని విమర్శలొస్తున్నాయి. హైడ్రా అధికారులు ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా కేవలం పేదల ఇండ్ల మీదే ప్రతాపం చూపుతారని, పెద్దలకు మినహాయింపు ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

Next Story