- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ శాఖలో అవినీతి మళ్లీ బట్టబయలు..?
జీడిమెట్ల విద్యుత్ డివిజన్ పరిధిలో మరోసారి అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

దిశ, దుండిగల్ : జీడిమెట్ల విద్యుత్ డివిజన్ పరిధిలో మరోసారి అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 2025 ఏప్రిల్‌లో అక్రమంగా విద్యుత్ మీటర్ల నిల్వ, సరఫరా వ్యవహారంలో విజిలెన్స్ అధికారులకు పట్టుబడి సస్పెండ్ కావడంతో పాటు జైలుకు వెళ్లిన ఓ ఆర్టిజన్ ఉద్యోగి, విచారణ ఇంకా కొనసాగుతుండగానే తిరిగి గతంలో పనిచేసిన దొమ్మరపోచంపల్లి సెక్షన్‌లోనే విధుల్లో చేరడం పలు అనుమానాలకు తావిస్తోంది. డీపీ పల్లి సెక్షన్‌లో ఆర్టిజన్‌గా పనిచేసిన రాజు అనే ఉద్యోగి, దుండిగల్ పరిధిలోని పల్లవి ఆశ్రమం సమీపంలో ఒక గదిలో సుమారు 20 డొమెస్టిక్ విద్యుత్ మీటర్లను అక్రమంగా నిల్వ ఉంచినట్లు ఆరోపణలు రావడంతో 2025 ఏప్రిల్ 19న విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతరం అతనిపై శాఖాపరమైన చర్యలతో పాటు పోలీసు కేసు నమోదై కొంతకాలం జైలుశిక్ష కూడా అనుభవించినట్లు సమాచారం. అయితే విచారణ పూర్తికాకముందే, నిబంధనలకు విరుద్ధంగా అతనికి మళ్లీ అదే డివిజన్‌లో పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా, గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అదే సెక్షన్‌లో విధులు అప్పగించడంపై స్థానిక ప్రజలు, విద్యుత్ వినియోగదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ అండతోనే పోస్టింగ్?
సదరు ఉద్యోగి మొదట జీడిమెట్ల సెక్షన్‌కు బదిలీ చేసినప్పటికీ, అక్కడ అక్రమ ఆదాయానికి అవకాశాలు తక్కువగా ఉండటంతో విధుల్లో చేరలేదని, అనంతరం అధికార పార్టీకి చెందిన ఓ స్థానిక యువ నాయకుడి సహకారంతో హై లెవల్ సిఫార్సులు తెచ్చుకుని తిరిగి డీపీ పల్లి సెక్షన్‌కే పోస్టింగ్ పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫామ్‌హౌస్‌కు అనుమతులు లేకుండానే కనెక్షన్..?
డీపీ పల్లి పరిధిలోని అసైన్డ్ భూమిలో ఏర్పాటు చేసిన ఓ ఫామ్‌హౌస్‌కు అధికారిక మీటర్లు లేకుండానే విద్యుత్ సరఫరా చేసి నెలనెలా నగదు వసూలు చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఎంఎల్ఆర్ఐటి కళాశాల నుంచి డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి వెళ్లే మార్గంలో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా ఆరు విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేసి, అనధికారికంగా ప్యానెల్ బోర్డు కూడా బిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
"సిబ్బంది కొరత వల్లే పోస్టింగ్"
ఈ ఆరోపణలపై జీడిమెట్ల డివిజన్ ఏడీఈ వీరేశలింగంను వివరణ కోరగా, డీపీ పల్లి సెక్షన్‌లో సిబ్బంది కొరత ఉండటంతోనే రాజు అనే ఆర్టిజన్‌కు తిరిగి పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. పోస్టింగ్‌లపై తుది నిర్ణయం డీఈ, ఎస్‌ఈ స్థాయిలోనే తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, డీపీ పల్లి సెక్షన్ ఏఈ సమ్మయ్య మాట్లాడుతూ, రాజు తమ సెక్షన్‌లో విధుల్లో చేరిన విషయం వాస్తవమేనని, తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించినందున గత పరిణామాలపై పూర్తి సమాచారం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా, ఇదే సెక్షన్‌లో గతంలో పనిచేసిన ఏఈ సురేందర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటనను స్థానికులు గుర్తు చేస్తున్నారు. వరుసగా అవినీతి ఆరోపణలు వెలుగుచూస్తుండటంతో జీడిమెట్ల విద్యుత్ డివిజన్ పనితీరుపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.






