- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాల్వంచలో ముదురుతున్న రౌడీయిజం..!
పాల్వంచ పట్టణంలోని సీతారాంపట్నంలో చోటుచేసుకున్న ఘర్షణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

దిశ, పాల్వంచ టౌన్: పాల్వంచ పట్టణంలోని సీతారాంపట్నంలో చోటుచేసుకున్న ఘర్షణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. స్థానికంగా ప్రారంభమైన వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరుకోవడంతో పట్టణంలోని శాంతిభద్రతల పరిస్థితులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 35వ డివిజన్ సీపీఐ కార్పొరేటర్ నామా కీర్తి భర్త నామా వినోద్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై దాడి జరిగినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ ఘటన వెనుక పేకాట స్థావరాల వివాదమా..? భూ కబ్జాల వ్యవహారమా..? లేక రాజకీయ ఆధిపత్య పోరాటమా..? అనే అంశాలపై స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది. బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఇది సాధారణ ఘర్షణ కాదని, భూముల వ్యవహారంలో నెలకొన్న వివాదాలు, ఒత్తిళ్లు, బెదిరింపుల పరిణామమేనని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి వర్గం ఆ ఆరోపణలను ఖండిస్తున్నట్లు సమాచారం. ఘటన అనంతరం ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించగా, పోలీస్ స్టేషన్‌లోనే వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
చిన్నచిన్న విభేదాలు సైతం..
పరస్పర ఆరోపణలు, ప్రతిఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో మరోసారి పాల్వంచలో పెరుగుతున్న రౌడీయిజం, అక్రమ కార్యకలాపాలు, రాజకీయ కక్షలు, ఆధిపత్య పోరాటాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మధ్య కాలంలో పాల్వంచ పరిసర ప్రాంతాల్లో వరుసగా ఘర్షణలు, దాడులు, వివాదాలు చోటుచేసుకుంటుండటం గమనార్హం. చిన్నచిన్న విభేదాలు సైతం పెద్ద స్థాయి గొడవలకు దారితీస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రశాంత వాతావరణానికి నిలయంగా పేరుగాంచిన పాల్వంచలో వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు ప్రజల భద్రతపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. “పాల్వంచలో చట్టమే రాజ్యమా..? లేక రౌడీలదే రాజ్యమా..?”
భూ వివాదాల ముసుగులో సాగుతున్న..
“చిన్నచిన్న వివాదాలు ఎందుకు పెద్ద ఘర్షణలుగా మారుతున్నాయి..?” “పేకాట స్థావరాలు, భూ వివాదాలు, రాజకీయ జోక్యాలపై నిఘా ఉందా..?” “పెరుగుతున్న రౌడీయిజాన్ని కట్టడి చేయడంలో వైఫల్యం ఎవరిది..?” అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల నుంచి బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడమే పాలనకు అసలైన పరీక్ష అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సీతారాంపట్నంలో చోటుచేసుకున్న ఈ ఘర్షణ రాజకీయ పెత్తనం కోసం జరిగిందా..? పేకాట స్థావరాల పరిరక్షణ కోసమా..? లేక భూ వివాదాల ముసుగులో సాగుతున్న ఆధిపత్య రాజకీయాల ఫలితమా..? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. అయితే పాల్వంచలో పెరుగుతున్న రౌడీయిజం, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు, రాజకీయ నాయకులు, పోలీసు యంత్రాంగం ఎంత మేరకు విజయవంతమవుతారన్నదే ప్రస్తుతం ప్రజల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.






