- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యతో మాట్లాడకపోవడం క్రూరత్వం కాదు! ఓ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, కొన్ని రోజుల పాటు మాట్లాడుకోకపోవడం వైవాహిక జీవితంలో సాధారణ విషయమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, కొన్ని రోజుల పాటు మాట్లాడుకోకపోవడం వైవాహిక జీవితంలో సాధారణ విషయమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం భార్యతో కొన్ని రోజుల పాటు మాట్లాడలేదన్న కారణంతో భర్తను క్రూరత్వానికి (ఐపీసీ సెక్షన్ 498A కింద) పాల్పడినట్లుగా దోషిగా నిర్ధారించలేమని తాజాగా తీర్పునిచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే.. భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో ఒక వ్యక్తికి కింది కోర్టు, మద్రాస్ హైకోర్టులు మూడేళ్ల జైలు శిక్ష విధించాయి. మరణానికి ముందు 13 రోజుల పాటు భర్త ఆమెతో మాట్లాడకపోవడం కూడా ఈ ఆరోపణల్లో ఒకటి. దీనిపై అప్పీలుకు వెళ్లగా.. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చంద్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారించి కింది కోర్టుల తీర్పును కొట్టివేసింది. భర్తను నిర్దోషిగా విడుదల చేసింది.
చిన్న గొడవలు క్రూరత్వం కాదు..
సరైన ఆధారాలు లేకుండా, కేవలం 13 రోజులు భార్యతో మాట్లాడకపోవడాన్ని ఏ కోణంలోనూ క్రూరత్వంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. ఆత్మహత్యకు ప్రేరేపించేంత స్థాయిలో దంపతుల మధ్య ఎలాంటి తీవ్రమైన గొడవలు జరిగినట్లు ఈ కేసులో ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను సెక్షన్ 498A కింద ‘క్రూరత్వం’గా పరిగణించలేమని తెలిపింది.
క్రూరత్వం అంటే ఏమిటి?
ఒక మహిళను ఆత్మహత్యకు పురిగొల్పేలా లేదా ఆమె మానసిక, శారీరక ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించేలా ఉద్దేశపూర్వకంగా చేసే వేధింపులను మాత్రమే క్రూరత్వంగా పరిగణించాలని కోర్టు న్యాయపరమైన వివరణ ఇచ్చింది. ఫిర్యాదు చేయడానికి ముందు జరిగిన నిరంతర వేధింపులను పరిగణనలోకి తీసుకోవాలని, వాస్తవ పరిస్థితులను న్యాయస్థానాలు క్షుణ్ణంగా విశ్లేషించాలని సూచించింది.






