ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి డయాఫ్రంవాల్ ధ్వంసం చేశారు: మంత్రి నిమ్మల

by Naga Rani Yarlagadda |

ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం చాలా నష్టపోయిందని, ఇప్పుడిప్పుడే మళ్లీ అన్ని వ్యవస్థలు గాడినపడుతున్నాయని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి డయాఫ్రంవాల్ ధ్వంసం చేశారు: మంత్రి నిమ్మల
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం చాలా నష్టపోయిందని, ఇప్పుడిప్పుడే మళ్లీ అన్ని వ్యవస్థలు గాడినపడుతున్నాయని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో జలవనరులశాఖపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాజెక్టులు, వాటి తాజా స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 36 ప్రధాన ప్రాజెక్టులు ఏ స్థాయిలో ఉంటాయో వాటి కార్యాచరణను వివరించారు. విధ్వంసమైన జలవనరుల రంగాన్ని పూర్వ స్థితికి తీసుకువస్తున్నామని తెలిపారు. 2019లో ఉన్న ప్రభుత్వమే నేటికీ కొనసాగి ఉంటే.. 2021 నాటికి పోలవరం పూర్తయ్యేదని నిమ్మల రామానాయుడు తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి డయాఫ్రంవాల్ ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. ఆఖరికి పోలవరం నిర్వాసితులను కూడా గొడ్డలిపార్టీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. జులై 2026 నాటికి పోలవరం ఎడమకాలువ ద్వారా అనకాపల్లికి నీటిని సరఫరా చేయడం లక్ష్యమని తెలిపారు.

2014-19 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరిగాయని, 72 శాతం పనులను పూర్తిచేశామని పేర్కొన్నారు. మరో ఐదేళ్లపాటు పాలన కొనసాగి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని తెలిపారు. జగన్ ఒక్క ఛాన్స్ అని వచ్చి.. విధ్వంస పాలన చేసి పోయారని యద్దేవా చేశారు. ఏజెన్సీలు, కాంట్రాక్టులను రద్దు చేయవద్దని ఎవరెంత హెచ్చరించినా గత వైసీపీ ప్రభుత్వం లెక్కచేయలేదన్నారు. 17 నెలల పాటు ఏజెన్సీ, అధికారులు లేకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో చేయకూడని తప్పులు చేసిందని, ఫలితంగా 2020లో వచ్చిన వరదలకు డయాఫ్రంవాల్ దెబ్బతిన్నదని నిపుణులు తెలిపారని మంత్రి నిమ్మల వివరించారు.

Next Story