- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి సంరక్షణ పనులు ముమ్మరం చేయాలి.. సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా నీటి సంరక్షణ పనులను వేగవంతం చేసి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ జలసిరి, ఇందిరమ్మ ఇండ్ల అమలుపై హౌసింగ్ ఏఈలు, ఎంపీడీఓలు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, ఊట కుంటలు, బోర్‌వెల్ రీచార్జ్ పనులను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫామ్ పాండ్లు, బోర్‌వెల్ రీచార్జ్ వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ఆర్థిక సహాయం, నిర్మాణ సామగ్రి తదితర అంశాలపై
అలాగే ప్రభుత్వ, ప్రజల బోర్‌వెల్ రీచార్జ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి అమలు చేయాలని, నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ పేర్కొన్నారు. మొదటి దశలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి స్థాయిల వారీగా పురోగతి సాధించాలని, ప్రతి మండలంలో నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం, నిర్మాణ సామగ్రి తదితర అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. గుడిసెలు, రేకుల షెడ్లలో నివసిస్తున్న అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






