చార్మినార్ వద్ద మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురికి జైలు శిక్ష

by Taduka Kalyani |

మహిళలు, బాలికల భద్రతకు కట్టుబడి పనిచేస్తున్న హైదరాబాద్ షీ టీమ్స్ మరోసారి తమ సమర్థతను చాటుకున్నాయి.

చార్మినార్ వద్ద మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురికి జైలు శిక్ష
X

దిశ, చంపాపేట్ , జూన్ 5: మహిళలు, బాలికల భద్రతకు కట్టుబడి పనిచేస్తున్న హైదరాబాద్ షీ టీమ్స్ మరోసారి తమ సమర్థతను చాటుకున్నాయి. చార్మినార్ పరిసర ప్రాంతంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురు వ్యక్తులను షీ టీమ్స్ సిబ్బంది పట్టుకుని, వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో దోషులుగా నిరూపించడంలో విజయం సాధించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పర్యవేక్షణలో మహిళల భద్రత కోసం నిరంతరం నిఘా నిర్వహిస్తున్న షీ టీమ్స్, చార్మినార్ ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రజా ప్రదేశాల్లో మహిళలను అనుచితంగా తాకుతూ వేధింపులకు పాల్పడుతున్న ఐదుగురిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నాయి. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బి యెన్ ఎస్ ) సెక్షన్ 292తో పాటు సిటీ పోలీస్ చట్టంలోని 70(సి ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. నాంపల్లిలోని VII స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు కేసును విచారించి, నిందితులందరినీ దోషులుగా నిర్ధారించింది. ప్రతి నిందితుడికి మూడు రోజుల సాధారణ జైలు శిక్ష (సింపుల్ ఇంప్రెషన్ మెంట్ )తో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా మహిళలు, బాలికలపై వేధింపులు, వెంటాడటం, సైబర్ దాడులు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ హెచ్చరించాయి. ఎలాంటి వేధింపులు ఎదురైనా బాధితులు మౌనంగా ఉండకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించాయి.

ప్రజలకు షీ టీమ్స్ సూచనలు

సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

వ్యక్తిగత వివరాలను అవసరానికి మించి పంచుకోవద్దు.

ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్లు, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉపయోగించాలి.

వేధింపులు, బెదిరింపులు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి.

సహాయం కోసం డయల్ 100, 112 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

“మహిళల గౌరవం, భద్రతపై రాజీ లేదు”

వేధింపులకు పాల్పడేవారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని మరోసారి స్పష్టం చేసిన షీ టీమ్స్.

Next Story