మున్సిపాలిటిల్లో అవినీతి కంపు..!

by Ajay Maddhiboyina |

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఉద్యోగులపై అవినీతి అరోపణలు వస్తున్నా, ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ పట్టుపడుతున్నా షరా మాములే అయిపోయింది.

మున్సిపాలిటిల్లో అవినీతి కంపు..!
X

దిశ,మేడ్చల్ బ్యూరో : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఉద్యోగులపై అవినీతి అరోపణలు వస్తున్నా, ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ పట్టుపడుతున్నా షరా మాములే అయిపోయింది.పలు మున్సిపాలిటీల్లో ఏళ్ల తరబడి ఓకే చోట విధులు నిర్వహించడం.. రాజకీయ, లోకల్‌ బలం కలగలిపి వారి అక్రమాలకు, అవినితీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రతి పనికో రేటు ఫిక్స్ చేసి మరీ మామూళ్ల మత్తులో జోగుతున్నారు.

అత్యధిక మున్సిపాలిటీలు ఇక్కడే..

రాష్ట్రంలోనే అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 (నిజాంపేట, జవహర్ నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్) కార్పొరేషన్లు, 9 (దుండిగల్, కొంపల్లి, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, నాగారాం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్ కేసర్) మున్సిపాలిటీలు ఉండగా, గత నెలలో మరో మూడు కొత్తగా ఎల్లంపేట, ఆలియాబాద్, మూడు చింతపల్లిని మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. 61 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సమీప మున్సిపాలిటీల్లో దశలవారీగా విలీనం చేశారు. అయితే ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరైనట్లుగా ఉంది ఇక్కడ ఉద్యోగుల తీరు. పంచాయితీల్లో పనిచేసిన ఉద్యోగులు, మున్సిపాలిటీలకు కేటాయించిన ఉద్యోగులంతా కుమ్మక్కై అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంజరీనింగ్, టౌన్ ప్లానింగ్, ట్యాక్స్, తాగునీటి సరఫరాలో అక్రమాలు మరీ ఘోరంగా మారాయి.

అడిగినంత ఇవ్వకుంటే..తిప్పలే..

మున్సిపాలిటీల్లో అభివృద్ది మాటేమోగాని అవినీతిలో మాత్రం ముందంజలో ఉన్నాయనే చెప్పాలి. ఇక్కడ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఎక్కువ గా ఉందన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఎవరైనా ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే లేని రూల్స్ చెప్పేస్తారు. అన్ని ఛలాన్లు, జరిమానాలు కట్టించాక అసలు సినిమా చూపిస్తారు. ఏదొక చిన్న కొర్రీ పెట్టి మరీ నిర్మాణానికి అనుమతి అపేస్తున్నారు. ఆ తర్వాత బేరం కుదిరితే అనుమతులొస్తున్నాయి. ఒక్కటి కాదు. రెండు కాదు.. దాదాపుగా ఇంటి నిర్మాణాలకు అనుమతుల విషయంలో టౌన్ ప్లానింగ్ అక్రమాలకు అడ్డు లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలంటూ హెచ్చరికలు, ఆపై బేరాసారాలతో టౌన్ ప్లానింగ్ అంత ఓ ప్లానింగ్ ప్రకారం అక్రమాలకు పాల్పడుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఒక రెవెన్యూ స్థాయి అధికారి సైతం అదే తరహాలో ప్రజలను పట్టి పీడిస్తున్నారు. ఇక్కడ కొత్తగా ఇంటి పన్నుకు దరఖాస్తు చేసుకునే వారు, ఇంటి పన్ను మార్పులు, చేర్పులు, ఖాళీ స్థలాలకు పన్ను విధింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా అసెస్ మెంట్ విషయంలో భారీ బకాయిదారుల నుంచి ముడుపులు తీసుకొని, వారికి మేలు చేసేలా పెద్ద ఎత్తున చేతులు మారుతున్నట్లు సమాచారం ఉంది.

ఏసీబీ దాడులు.. విజిలెన్స్ కు ఫిర్యాదులు..

ఏప్రిల్ నెలలో నాగారం మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ రమేశ్ దగ్గర రూ.75వేలు లంచం తీసుకుంటుండా డీఈ రఘును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక్కడ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధికా గుప్తాయే స్పెషల్ ఆఫీసర్ గా ఉండడం గమనార్హం. అదనపు కలెక్టర్ స్థాయి అధికారి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నా నాగారం మున్సిపాలిటీలోనే డీఈ స్థాయి అధికారి లంచం తీసుకుంటు పట్టుబడ్డారంటే అవినితి ఏ రేంజ్‌లో ఉందనేది అర్థమవుతోంది. అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఉన్న తూంకుంట మున్సిపాలిటీలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్, కంప్యూటర్ అపరేటర్ ఇదే నెల 5వ తేదీన ఏసీబీకి చిక్కారు. హైదరాబాద్ కు చెందిన ఓవ్యక్తి తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో రెండు ఇళ్లను కొనుగోలు చేయగా, వాటి మ్యుటేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అందుకోసం రూ.20 లంచం ఇవ్వాలని బిల్ కలెక్టర్ రాంరెడ్డి, కంప్యూటర్ అపరేటర్ శ్రవణ్ డిమాండ్ చేశారు. ఇంటి యజమాని ఏసీబీ అధికారులను అశ్రయించి, వారి సలహా మేరకు ఉద్యోగులకు డబ్బులు ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జవహర్‌నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, నిజాంపేట కార్పొరేషన్లతో పాటు దమ్మాయిగూడ, పోచారం, తూంకుంట, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్ తదితర మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా విషయంలో వాహనాల మరమ్మతులు, మోటార్ల రిపేర్లు, సామాగ్రి కొనుగోలు పేరిట రూ. లక్షలు గోల్ మాల్ అయినట్లు సమాచారం. వీటిపై స్థానికులు కొందరు విజిలెన్స్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు అవినీతికి అడ్డు కట్ట వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Next Story