గుంతల రోడ్డుతో నిత్యం ప్రాణభయం..

by Kodari Anjali |

చెంగిచెర్ల క్రాంతి కాలనీ–అరవింద కాలనీల మధ్య రహదారి అధ్వాన్నంగా మారింది.

గుంతల రోడ్డుతో నిత్యం ప్రాణభయం..
X

దిశ, మేడిపల్లి: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల క్రాంతి కాలనీ–అరవింద కాలనీల మధ్య ఉన్న ప్రధాన రహదారి భారీ గుంతలతో దెబ్బతిని ప్రజలకు నిత్యం ప్రమాదకరంగా మారింది. వర్షాల కారణంగా గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, పాఠశాల బస్సులు, ఆటోలు, కార్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ రహదారి క్రాంతి కాలనీ, అరవింద కాలనీ, రామకృష్ణ కాలనీ, జయశ్రీ కాలనీ, జయప్రద కాలనీ తదితర ప్రాంతాలను అనుసంధానించే ప్రధాన మార్గం. ప్రతిరోజూ వందలాది మంది ఈ రహదారిపై ప్రయాణిస్తుండగా, గుంతలు కనిపించక వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు స్వల్ప ప్రమాదాలకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వేలకు వేలు మున్సిపల్ పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని ప్రమాదాలు జరగకముందే రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

Next Story