ఎంఎంసీకి సీఎం వరాల జల్లు..

by Taduka Kalyani |

గ్రేటర్ అభివృద్ధి పై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. నగర శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది.

ఎంఎంసీకి సీఎం వరాల జల్లు..
X

దిశ,మేడ్చల్ బ్యూరో : గ్రేటర్ అభివృద్ధి పై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. నగర శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉప్పల్ భాగాయత్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు రూ. 1511 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి,నగర అభివృద్ధికి కీలక అడుగు వేశారు. ఉప్పల్ భగాయత్ లో రూ. 98 కోట్లతో నిర్మించనున్న ఎంఎంసీ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి అదే ప్రాంతంలో ఖత్రి భవన్, వంజరీ కులస్థుల ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించారు.

అన్ని సేవలు ఒకే గొడుగు కిందకు..

క్యూర్ పరిధిలో పౌర సేవలను త్వరితగతిన పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి క్యూర్ మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఆస్తి పన్ను, విద్యుత్, నీటి బిల్లులు చెల్లించే అవకాశం కల్పించారు.నగర ప్రజలకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు..

ఎంఎంసీ మరింభవనానికి శంకుస్థాపన

గ్రేటర్ హైదరాబాద్ ను మూడు కార్పొరేషన్లకు విభజించిన తెలంగాణ సర్కారు పాలన పరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రూ.98 కోట్లతో ఉప్పల్ భాగయత్ లో 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.ఈ కొత్త భవనం అందుబాటులోకి వస్తే పరిపాలన మరింత పారదర్శకంగా ,వేగంగా సాగేందుకు దోహదపడుతోంది.

ఉప్పల్ లో ట్రాఫిక్ కు చెక్..

ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్లుతోంది.ఉప్పల్ టికేఆర్ కాలేజ్ జంక్షన్ లో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.416 కోట్లతో ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.ఈ జంక్షన్ అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ప్లై ఓవర్ పూర్తయితే ప్రయాణికుల సమయం ఆదా అవుతోంది. అదేవిధంగా ఏవోసీ సెంటర్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీని తగ్గించేందుకు రూ.960 కోట్లతో ప్రత్యామ్నామ రోడ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఉప్పల్,సికింద్రాబాద్, ఈసీఐఎల్ ,కాప్రా ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయి. ఉప్పల్ రూ.37.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంద పడకల మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ఆసుపత్రి ద్వారా స్థానిక ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ, పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, సామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మిక్కిలినినేని మనుచౌదరి, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story