చర్లపల్లి ఐజీ కాలనీ సమస్యలు పరిష్కరిస్తా : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

by Ratna Kumari |

చర్లపల్లి ఐజీ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నివాసితులకు హామీ ఇచ్చారు.

చర్లపల్లి ఐజీ కాలనీ సమస్యలు పరిష్కరిస్తా :  ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
X
దిశ‌, కాప్రా : చర్లపల్లి ఐజీ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నివాసితులకు హామీ ఇచ్చారు. గురువారం విభాగాల అధికారులతో ఐజీ కాలనీ క్వార్టర్స్ లో నెలకొన్న సమస్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కాలనీలోని భవనాల పైకప్పుల లీకేజీలు, డ్రైనేజ్ సమస్యలు, భవనాల స్లాబ్ పగుళ్లు వంటి తీవ్రమైన ఇబ్బందులను ఆయన అధికార దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఐజీ కాలనీలో నెలకొన్న సమస్యలపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సైతం మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాలనీ వాసులకు ఇచ్చిన మాట ప్రకారం.. గురువారం సంబంధిత శాఖల అధికారులతో ఐజీ కాలనీకి నెలకొన్న సమస్యలను వారందరికీ వివరించారు. ఇక్కడి నివాసితులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలనీవాసులకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Next Story