కంటోన్మెంట్ అసెంబ్లీ బరిలో నిలిచేందుకు వారి కూతుళ్లు సై!

by Disha Web Desk 7 |
కంటోన్మెంట్ అసెంబ్లీ బరిలో నిలిచేందుకు వారి కూతుళ్లు సై!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లోపు అసెంబ్లీ ఎన్నికల ఘట్టం పూర్తి కావాల్సి ఉంది. దీంతో రాష్ట్రంలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు తమ సీట్లను ఖరారు చేసుకునే పనిలో బీజీగా ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా, మాజీ ఎమ్మెల్యేలు సాయన్న, డాక్టర్ పి.శంకర్ రావుల తనయ(కూమార్తెలు)లు లాస్య నందిత, సుశ్మీతలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తన తండ్రులు ప్రతినిధ్యం వహించిన ఎస్సీ రిజర్వుడు కంటోన్మెంట్ అసెంబ్లీ బరిలో పోటీ చేసేందుకు ‘సై’ అంటున్నారు.

కార్పొరేటర్‌గా లాస్య నందితకు అనుభవం..

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె లాస్య నందిత కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాల్గవ వార్డు నుంచి పోటీ చేసి నళిని కిరణ్‌పై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆ తర్వాత 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లాస్య నందిత ఓడిపోయారు. దీంతో తండ్రి సాయన్నకు రాజకీయపరంగా చేదోడు వాదోడుగా కొనసాగుతూ వచ్చారు.

సాయన్న వారసురాలిగా..

ఇటివల సాయన్న అకాలమరణం చెందడంతో తండ్రి బాధ్యతలను లాస్యనందిత తీసుకున్నారు. పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూ పాలన, రాజకీయపరమైన కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నారు. అయితే సాయన్న వెంటనడిచిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు లాస్యనందితకు సహకారించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. సాయన్న మరణంతో వారంతా తలోదారి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్‌లో అసెంబ్లీ టికెట్ కోసం హేమాహేమీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు డాక్టర్ ఏర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేశ్, క్రిశాంక్‌లతో పాటు సీనియర్ నేతలు శ్రీగణేశ్, ముప్పిడి మధుకర్‌లు టికెట్‌ను అశీస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ సాయన్న పైన ఉన్న అభిమానం, సానుభూతితో తనకే టికెట్ కేటాయిస్తుందని లాస్యనందిత ధీమాతో ఉన్నారు.

తండ్రి బాటలో తనయ..

ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనకు కేరాఫ్‌గా నిలిచిన మాజీ మంత్రి డాక్టర్ పి.శంకర్ రావు ఏకైక కుమార్తె సుశ్మిత. ఈ నెల 21న జరిగిన బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో సుశ్మిత కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ సునీల్ బన్సల్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఆమెకు కండువా కప్పి పార్టీలో ఆహ్వనించారు. శంకర్ రావు గతంలో షాద్‌నగర్‌తో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో సాయన్నపై కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన శంకర్ రావుకు మంత్రివర్గంలో స్థానం లభించింది. శంకర్ రావు రాజకీయ వారసురాలిగా సుశ్మిత కొనసాగుతున్నారు. సుశ్మిత యూకేలో మాస్టర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసి, ఇంటర్నేషనల్ లీడర్ షిప్ మేనేజ్‌మెంట్, ఎల్‌ఎల్‌బీ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

గణేశ్ టెంపుల్ చైర్మన్‌గా..

జంటనగరాల్లోనే ప్రముఖ సికింద్రాబాద్ గణపతి ఆలయ చైర్మన్‌గా పనిచేసి, రూ.60 లక్షలు ఉన్న టెంపుల్ ఆదాయాన్ని ఏడాదికి రూ.4.50 కోట్లు వచ్చేలా కృషి చేశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న సుశ్మిత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. తండ్రి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆమె బీజేపీ పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా సుశ్మిత మేనమామ వివేక్ వెంకటస్వామి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన ద్వారా అసెంబ్లీ టికెట్ సాధించుకోవచ్చని యోచిస్తున్నట్లు శంకర్ రావు అభిమానులు చెబుతున్నా మాట.



Next Story

Most Viewed