- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారుకు ఈసీ బ్రేక్..! ఎక్స్ అఫీషియో ఓటుతో ఎల్లంపేట ఛైర్మన్ గిరిపై బీఆర్ఎస్ గురి
ఎక్స్ అఫీషియో ఓటు విషయంలో ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చాయి.ఎక్స్ అఫీషియో ఓటుతో ఎల్లంపేట మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని భావించిన బీఆర్ఎస్ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి.

దిశ,మేడ్చల్ బ్యూరో: ఎక్స్ అఫీషియో ఓటు విషయంలో ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చాయి.ఎక్స్ అఫీషియో ఓటుతో ఎల్లంపేట మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని భావించిన బీఆర్ఎస్ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటింగ్ లో పాల్గొనాలంటే సదరు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కచ్చితంగా ఆ మున్సిపాలిటీలో ఓటరు అయి ఉండాలని, లేదంటే వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా అనర్హులని శనివారం ఎన్నికల సంఘం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటరు నమోదు చేసుకుని,ఆ ఓటుతో మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలను దక్కించుకోవాలని భావించిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి గట్టి ఎదురు దెబ్బనే తగిలింది.
బీఆర్ఎస్ కు పీఠం దక్కేనా..?
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరిగా సాగిన పుర ‘పోరు’లో ఎల్లంపేట మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫీగర్ కు బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు సరిపోతుంది. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డులుండగా, 12 వార్డులలో బీఆర్ఎస్ విజయం సాధించింది.. 8 వార్డులలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా, బీజేపీ 4 వార్డులలో నెగ్గింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి అదనంగా ఇంకో సీటు వస్తే ఛైర్మన్,వైస్ ఛైర్మన్ పీఠాలను సులువుగా కైవసం చేసుకునే వీలుండేది. కానీ బీఆర్ఎస్ పార్టీకి 12 సీట్లు మాత్రమే రావడంతో మరో ఓటు కీలకంగా మారింది.దీంతో స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎక్స్ ఆఫీషియో ఓటరు నమోదు చేసుకోవాలని భావించారు. అయితే మల్లారెడ్డికి ప్రస్తుతం కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని న్యూబోయిన్ పల్లిలో ఓటు ఉంది. దీంతో మల్లారెడ్డికి ఎక్స్ అఫీషియో ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
కోర్టు ఆదేశాలతో..
గతంలో రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు రాష్ట్రంలోని తమకు నచ్చిన మున్సిపాలిటీని ఎంచుకుని ఎక్స్ అఫీషియో సభ్యులుగా మేయర్, ఛైర్మన్ ఎన్నిక కోసం ఓటు వేసే అవకాశం ఉండేది. అయితే గతంలో ఈ అంశంపై వివాదం నడిచింది. దీనిని విచారించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. స్థానికంగా ఓటు లేకుండా ఇతర మున్సిపాలిటీల్లో ఓటు వేయటం నిబంధనలకు విరుద్దమని వెల్లడించింది. హై కోర్టు ఆదేశాల నేపథ్యంలో తాజాగా ఎస్ఈసీ నిర్ణయం తీసుకొంది.ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయాలంటే మున్సిపాలిటిలో ఓటరు జాబితాలో వారి పేరు ఉండాలి. ఒకవేళ మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే.. వారు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఓటేయటానికి ,కొనసాగడానికి అనర్హులు, నిబంధనలు విరుద్ధంగా అర్హత లేకుండా ఓట్లు వేస్తే అవి చెల్లవని ఎస్ఈసీ స్పష్టం చేసింది. అయితే ఎల్లంపేట, ఆలియాబాద్ మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడటంతో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి.తాజా ఎస్ఈసీ నిబంధనలతో..స్థానికంగా ఓటు లేని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు తమ ఓటను వినియోగించుకునేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఎల్లంపేట, ఆలియాబాద్ పురపాలికల్లో మున్సిపల్ పీఠాల సమీకరణాలు మారే ఛాన్స్ ఉంది.






