లాల్‌గడ్ మలక్‌పేట ఘటన..బీఆర్ఎస్ ఫిర్యాదు

by velandi.Saikiran |

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా బీఆర్ఎస్ నాయకుల పై అకారణంగా దాడులకు పాల్పడుతూ కాంగ్రెస్ నాయకులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆరోపించారు.

లాల్‌గడ్ మలక్‌పేట ఘటన..బీఆర్ఎస్ ఫిర్యాదు
X

లాల్‌గడ్ మలక్‌పేట ఘటన

ఎన్నికల కమిషనర్‌, పోలీస్ కమిషనర్లకు బీఆర్ఎస్ ఫిర్యాదు

దిశ, మేడ్చల్ బ్యూరో : ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా బీఆర్ఎస్ నాయకుల పై అకారణంగా దాడులకు పాల్పడుతూ కాంగ్రెస్ నాయకులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. ఆలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్‌గడ్ మలక్‌పేటలో శుక్రవారం జరిగిన ఘటనపై శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినితో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ లాల్‌గడ్ మలక్‌పేటలో శుక్రవారం మధ్యాహ్నం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కౌన్సిలర్ అభ్యర్థులతో ఎన్నికల పై సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.

ఆ సమయంలో కాంగ్రెస్ ప్రచార రథం వచ్చిందని, అధిక సౌండ్‌తో తమ మీటింగ్‌కు ఇబ్బందులు కలిగించిందన్నారు. సౌండ్ తగ్గించాలని తమ కార్యకర్తలు వెళ్లి అడిగితే కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తన అనుచరులతో కలిసి దళిత బీఆర్ఎస్ కార్యకర్త ఢిల్లీ పరమేష్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. అదేవిధంగా మూడు గంటల పాటు ఆందోళన పేరిట పోలీసుల ముందే భయానక వాతావరణాన్ని సృష్టించారని తెలిపారు. తన కారు అద్దాలను ధ్వంసం చేసి దుర్భాషలాడారని పేర్కొన్నారు. తనతో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కూడా దాడికి యత్నించారని వాపోయారు.

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్‌తో పాటు బాధ్యులైన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుపై వారు సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జీ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Next Story