- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో బీజేపీ పొత్తు
రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కుదరడం సాధారణ విషయం. ఇందుకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు.

దిశ, మేడ్చల్ బ్యూరో: పార్టీల సిద్దాంతాలు పక్కన పెట్టేశారు.. వైరుధ్యాలను మరిచిపోయారు. నాయకుల అంతిమ లక్ష్యం.. రాజకీయంగా లబ్ది పొందడమేనని నిరుపించారు. మున్సిపల్ ఛైర్మన్,వైస్ ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు విచిత్రమైన పొత్తులు పెట్టుకున్నాయి.రాజకీయ అవసరాలు,స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎవరితోనైనా సర్దుకుపోవడానికి ,పొత్తులతో హత్తుకోవడానికి పార్టీ అధి నాయకత్వాలు స్థానిక నేతలకు పూర్తి స్వేచ్చనివ్వడంతో జిల్లాలో ఊహించని విధంగా పొత్తులు ఏర్పాడ్డాయి. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కచోట, కాంగ్రెస్, బీజేపీ మరో చోట జతకట్టి హంగ్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలను దక్కించుకున్నాయి.
ఎల్లంపేట లో గులాబీ, కమలం దోస్తీ..
జిల్లాలోని ఎల్లంపేట ,ఆలియాబాద్ లలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో ఆ రెండు మున్సిపాలిటీలు హంగ్ గా అవతరించాయి.ఎల్లంపేటలో 24 వార్డులలో బీఆర్ఎస్ 12 వార్డులను గెలుపొందగా, కాంగ్రెస్ 8 వార్డులలో ,బీజేపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ కు ఒక ఓటు తక్కువగా ఉండడంతో ఎక్స్ అఫిషీయో ఓటర్ గా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నమోదు చేసుకోగా, ఇదే మున్సిపాలిటీలో స్థానిక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఎక్స్ అఫిషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.దీంతో బీజేపీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎంపిక కోసం కాంగ్రెస్ తో జతకట్టే అవకాశం ఉందని ఎమ్మెల్యే మల్లారెడ్డి గ్రహించారు. సోమవారం ఉదయమే శామీర్ పేటలోని ఎంపీ ఈటల రాజేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన మల్లారెడ్డి వైస్ ఛైర్మన్ ఆఫర్ ఇచ్చి నలుగురు బీజేపీ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టారు. దీంతో ఎల్లంపేట మున్సిపాలిటీ ఛైర్మన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ లావుడియా శ్రీదేవిని,వైస్ ఛైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ మేకల రజీతరెడ్డిని ఎన్నుకున్నారు.
ఆలియాబాద్ లో కాంగ్రెస్ , బీజేపీ పొత్తు
ఆలియాబాద్ లో 20 వార్డులుండగా, 8 వార్డులను కాంగ్రెస్ పార్టీ, 7 వార్డులను బీఆర్ఎస్ పార్టీ,3 వార్డులను బీజేపీ, ఒకరు బీఎస్పీ ,మరొకరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.ఎన్నికల ఫలితాల తర్వాత స్వతంత్ర్య, బీఎస్సీ అభ్యర్థులిద్దరు కాంగ్రెస్ గూటికి చేరడంతో వీరి బలం 10కి చేరింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీలో ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు సరిపడ మెజారిటీ లేకపోవడంతో ప్రత్యర్థి పార్టీల కౌన్సిలర్లకు గాలం వేశారు. వర్కవుట్ కాకపోవడంతో హస్తం పార్టీ బీజేపీ మద్దతును కోరింది.తమకు మద్దతు ఇస్తే ప్రతిఫలంగా వైస్ ఛైర్మన్ పదవిని ఇస్తామని హామి ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ ఛైర్మన్ పదవిని, బీజేపీ వైస్ ఛైర్మన్ పదవులను పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఛైర్మన్ గా శీరిష క్రిష్ణారెడ్డి, బీజేపీ నుంచి వైస్ ఛైర్మన్ గా మాలతి మాధవరెడ్డిలను ఎన్నుకున్నారు.
ఎక్కడి పొత్తులు అక్కడే..
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కుదరడం సాధారణ విషయం. ఇందుకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అందుకే రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు అనే నానుడి పుట్టింది. అయితే అన్ని పొత్తులను ఒకే గాటన కట్టేయలేము. ఒకప్పుడు పొత్తులకు అంతో ఇంతో ‘భావసారుప్యత’ లేదా ‘లౌకికవాదం’ అనే ముసుగులు అయినా ఉండేవి. ఇప్పుడు అవి కూడా తొలిగిపోయాయి. అధికారం కోసం ఉనికిని నిలుపుకునేందుకు ఇంకొన్ని పార్టీలు ఎవరితో అంటే వారితో సంసారానికి సై అంటున్నాయి.దేశ రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా ఉన్నా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆలియాబాద్ మున్సిపాలిటీలో అధికారాన్ని పంచుకోవడం పొలిటీకల్ సర్కిల్ లో తీవ్ర చర్చకు దారి తీసింది.అదే విధంగా నిన్నటివరకు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒంటికాలితో లేచిన బీజేపీ పార్టీ ఎల్లంపేట మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ తీసుకోవడం గమనార్హం.కేవలం పదవుల కోసమే మూడు ప్రధాన పార్టీలు కలువడం జిల్లాలో హాట్ టాఫిక్ గా మారింది.






