- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికార దాసోహం.. చెరువు ఆక్రమణకు అధికారుల అండదండలు
చెరువు గర్భంలో,ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం క్షమించరాని నేరం.

దిశ, మేడ్చల్ బ్యూరో: చెరువు గర్భంలో,ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం క్షమించరాని నేరం. ఇందుకు తోడ్పాటు అందించిన అధికారులు, కింది స్థాయి ఉద్యోగులను గుర్తించే ప్రక్రియ హైడ్రా మొదలు పెట్టింది.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.. సరిగ్గా ఏడాది కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో విలేకరులతో చిట్ చాట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు... కానీ మేడ్చల్ జిల్లా, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో చెరువు స్థలంలోనే అపార్ట్ మెంట్ ను నిర్మిస్తున్న ‘శ్రీ షిరిడి సాయి బిల్డర్స్ ’ సీఎం వ్యాఖ్యల్ని అస్సలు లెక్క చేయడం లేదు.ఫాక్స్ సాగర్ చెరువు బఫర్ జోన్ లో యధేచ్చగా అపార్ట్ మెంట్ నిర్మిస్తోంది. ఆ నిర్మాణ సంస్థకు హైడ్రా తో సహా హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ విభాగాల అధికారులు సహకరిస్తుండం విమర్శలకు తావిస్తోంది.
మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు..
చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ భూమిలో అపార్ట్మెంట్ నిర్మాణం చేసి, అమాయకులకు విక్రయిస్తున్న నిర్మాణ సంస్థ, ప్లాట్ ఓనర్ లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సంబంధిత అధికారులకు పలువురు ఫిర్యాదు చేస్తున్నారు.జిల్లాలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో శ్రీ షిరిడి సాయి బిల్డర్స్ నిర్మాణ సంస్థ చెరువు భూమిలో అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తున్నారని పేర్కొంటూ నిజాంపేట కార్పొరేషన్ మాజీ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్ గురువారం కొంపల్లి మున్సిపల్ కార్యాలయం, దుండిగల్ గండి మైసమ్మ ఎమ్మార్వో కార్యాలయా లలో ఫిర్యాదు చేశారు. భవనానికి పక్కన ఉన్న వాటర్ బాడీని చెరువుగా రికార్డులలో నమోదయి ఉండగా, నాలాగా పేర్కొంటూ తప్పుడుగా నివేదికలు అందజేసి అనుమతులు పొందారని, ఈ విషయంపై అధికారులు తక్షణమే స్పందించి సాధారణ నిర్మాణాన్ని తొలగించడంతోపాటు భవన యజమానులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి పై..
చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో శ్రీ షిరిడి సాయి బిల్డర్స్ వారు నిర్మిస్తున్న అపార్ట్మెంట్ యజమాని మాజీ మంత్రి ,మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ది గా తెలుస్తుంది. 2022 లో అప్పటి మంత్రి మల్లారెడ్డి సహాయ సహకారంతోనే ఏకంగా చెరువులోనే నిర్మాణానికి అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు కూడా వీరి అధికార దాసోహనికి బానిసలై నిజా నిజాలు పరిశీలించకుండా గుడ్డిగా అనుమతులు జారీ చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లోనే సర్వే చేసి ఫాక్స్ సాగర్ చెరువు యొక్క హద్దులు నిర్ణయించి , వాటికి సంబంధించిన గూగుల్ కోఆర్డినేట్ ను సైతం రికార్డులలో ఉంచారు.
అయినప్పటికీ 2022 లో భవన నిర్మాణ జమాని తప్పుడు నివేదికలు ఇవ్వడం, దాని ప్రకారం తప్పని తెలిసిన ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇవ్వడం, తదనుగుణంగా ఏమాత్రం అబ్జెక్షన్ చెప్పకుండా హెచ్ఎండి అధికారులు అనుమతులు జారీ చేసేయడం జరిగిపోయాయని పలువురు విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి చెరువులో నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారని, వాటిని వెంటనే రద్దుచేసి నిర్మాణాన్ని కూల్చివేయడంతో పాటుగా, అధికారులను తప్పుదారి పట్టించిన ఎమ్మెల్యే కుమారుడు భద్రారెడ్డి పై, వారికి సహకరించిన అధికారి యంత్రాంగంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






