గంజాయి విక్రేతల అరెస్ట్.. 6 కిలోల గంజాయి స్వాధీనం

by Kodari Anjali |

గంజాయి విక్రేతలను మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు.

గంజాయి విక్రేతల అరెస్ట్.. 6 కిలోల గంజాయి స్వాధీనం
X

దిశ, మేడ్చల్: గంజాయి విక్రేతలను మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో విక్రయించడానికి తీసుకొచ్చిన గంజాయిని స్వాధీనం చేసుకొని, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మునిరాబాద్ సమీపంలో రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో మేడ్చల్ పోలీసులు గురువారం రాత్రి ప్రత్యేక నిఘా పెట్టారు. ఇద్దరు వ్యక్తులు బ్యాగుతో అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. బ్యాగును స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా దాదాపు 6 కిలోల గంజాయి కనిపించింది. ఆ ఇద్దరిని విచారించగా, మహారాష్ట్రకు చెందిన సచిన్ సంతోష్ జాదవ్ అలియాస్ నితిన్, అలియాస్ ఆకాష్ (24), అదే రాష్ట్రానికి చెందిన రాజేష్ మాధవ్ చౌదరి(22) గా వెల్లడైంది.

కేసు నమోదు...

వారిద్దరూ ఈనెల 19వ తేదీన ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్‌కు వెళ్లారు. అక్కడ శంకర్ అనే వ్యక్తి వద్ద రూ. లక్ష యాభై వేల విలువైన ఆరు కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దాన్ని రెండు కిలోల చొప్పున వేరుచేసి మూడు ప్యాకెట్లలో ప్యాక్ చేశారు. గురువారం రాత్రి మేడ్చల్‌లో కార్మికులు, విద్యార్థులకు విక్రయించేందుకు గంజాయిని తీసుకొచ్చారు. వారి రాకను ముందే పసిగట్టిన మేడ్చల్ పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. వారి వద్ద లభ్యమైన బ్యాగులో ఉన్న మూడు ప్యాకెట్లను తూకం వేయగా.. మొత్తం 5.849 కిలోలుగా తూగింది. నిందితులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి గంజాయి, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై ఎన్ డి పి ఎస్ కింద కేసు నమోదు చేశారు.

Next Story