అక్రమ నిర్మాణాలకు నిలయం అల్వాల్ సర్కిల్..

by Disha Web Desk 11 |
అక్రమ నిర్మాణాలకు నిలయం అల్వాల్ సర్కిల్..
X

దిశ, అల్వాల్: అల్వాల్ సర్కిల్ అంటేనే అక్ర నిర్మాణాలకు నిలయంగా మారింది. ఇక్కడ లీగల్ ఇల్లీగల్ అంటూ ఏమిలేదు. అధికారులకు అడిగినంత ఇస్తే అక్రమం సక్రమం అవుతుందని స్థానికులు వాపోతున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు ఇలా ఉన్నాయి. లోతుకుంట నుంచి అల్వాల్ వెళ్లే ప్రధాన రాజీవ్ రహదారి పక్కనే రోడ్డును ఆనుకొని ఇటీవల అనేక దుకాణాలు వెలిశాయి. ముందు ఒక వైన్స్ షాపుతో ప్రారంభమైన దుకాణాలు పూల మొక్కల నుంచి మొదలు పెడితే అన్నివర్గాల ప్రజలకు కావలసిన తిను బండారాల వరకు ఇక్కడ దొరకని వస్తువులు లేవు అంటే నమ్మండి. ఒక మిని మార్కెట్ ను తలదన్నే విధంగా దుకాణ సముదాయం ఏర్పడింది. అందులో ఏ ఒక్కదానికి సైతం అనుమతులు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌజ్ కు వెళ్లే రహదారిలోనే ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఉంటే, కాలనీలు, బస్తీలకు వెళ్లే అంతర్గత రోడ్ల ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులే తెలుపాలంటున్నారు. మరొక విషయం ఏమిటంటే నగర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నందున ఇటీవల కొన్ని ప్రమాదాలు జరిగిన కారణంగా ఎలాంటి సెల్లారు తవ్వకాలు చేపట్టవద్దని జీహెచ్ఎంసీ ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేసిన ఇక్కడ మాత్రం యదావిధిగా సెల్లారు తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన అధికారి ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తున్నారంటే ఇక్కడి అధికారుల పనితీరు ఎలావుందో తెలిసి పోంతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకొని వ్యాపార సముదాయాల నిర్మాణాలకైతే ఇక్కడ లెక్కేలేదు.

ఇటీవల వెంకటాపురం వైష్ణవ మాత ఆలయం వద్ద రెసిడెన్షియల్ నిర్మాణం కోసం అనుమతి తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పది షెటర్లతో పెద్ద దుకాణ సముదాయమే నిర్మించారు. పది వ్యాపార దుకాణాలు ఏర్పాటు అయితే ట్రాఫిక్ రీత్యా ఆ రోడ్డు పరిస్థితి ఏమిటి అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రహదారులన్ని ట్రాఫిక్ తో కిక్కిరిసి పోయి ప్రయాణం అంటేనే నరకంగా మారిన ప్రస్తుత పరిస్థితిలో ఇలాంటి నిర్మాణాలతో బస్తీలు, కాలనీల రోడ్లు సైతం ట్రాఫిక్ మయం కానున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్మాణాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతో పాటు ప్రజలకు సైతం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడం తథ్యమన్నారు. అల్వాల్ వాసులు అల్వాల్ అంటేనే రెసిడెన్షియల్ జోన్ గా ఉన్న ప్రాంతాన్ని వ్యాపారమయంగా మార్చడంలో అధికారులే ప్రధాన కారకులు అంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.



Next Story