మైనర్‌పై లైంగిక దాడి ఘటనలో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

by Kodari Anjali |

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.

మైనర్‌పై లైంగిక దాడి ఘటనలో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, మేడ్చల్: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో మేడ్చల్ పోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్ 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ విషయాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరులో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన బల్బీర్ అధికారి అలియాస్ వికాస్ ఛత్రి అలియాస్ వికాస్, 2015 జూన్ 8న మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఆ బంధువుల ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో బాధిత బాలిక (15) తన చెల్లితో మాత్రమే ఉన్నట్లు గుర్తించాడు. ఇదే అదనుగా భావించి నీళ్లు కావాలంటూ బాలికను అడిగాడు. బాలిక నీళ్లు తీసుకొచ్చి ఇస్తుండగా, తనతో పాటు ఉన్న చెల్లిని ఇంటి బయటకు తోసివేసి తలుపుకు గడియ పెట్టాడు. అనంతరం బాలిక చేతులు, కాళ్లు కట్టేసి, అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

బాలికలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి..

బాలిక కుటుంబ సభ్యుల సహాయంతో అదే రోజు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అప్పటి సీఐ శంకర్ రెడ్డి కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన స్థానంలో వచ్చిన సీఐ రాజశేఖర్ రెడ్డి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుండగా సోమవారం కేసు తుది విచారణకు వచ్చింది. ఈ విచారణలో నిందితుడిపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో న్యాయమూర్తి వెంకటేశ్ 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా రూ.1 లక్ష పరిహారం అందించాలని ఆదేశించారు. సరైన సాక్ష్యాధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, లైజన్ అధికారి మౌనిక కీలక పాత్ర పోషించగా, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రెడ్డి బలమైన వాదనలు వినిపించి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. ఈ సందర్భంగా పీపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు, బాలికలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, వారిపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.

Next Story