రెండేళ్ల బాలుడికి అరుదైన వ్యాధి..ఆ ఇంజ‌క్ష‌న్ కు రూ.16 కోట్లు

by velandi.Saikiran |   (  Updated:2026-02-27 22:45:19  IST  )

ఘట్కేసర్ కాసుల కిరణ్,నవీన రెండేళ్ల కుమారుడు ఆర్యాన్ష్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్-2 వ్యాధితోబాధపడుతున్నాడు.

రెండేళ్ల బాలుడికి అరుదైన వ్యాధి..ఆ ఇంజ‌క్ష‌న్ కు రూ.16 కోట్లు
X

దిశ, ఘట్కేసర్: అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎం ఏ) వ్యాధితో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన పునర్విక గురించి ఇటీవల సోషల్ మీడియా, పత్రికల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ చిన్నారిని రక్షించేందుకు దాతలు, యావత్ సమాజం ఏకమై సహాయం అందించారు. ఇదే వ్యాధితో రెండేళ్ల బాలుడు బాధపడుతున్న మరో ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్‌ లో వెలుగులోకి వచ్చింది. ఘట్కేసర్ కేఎల్ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న కాసుల కిరణ్, నవీన రెండేళ్ల కుమారుడు ఆర్యాన్ష్ అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్-2 వ్యాధితో బాధపడుతున్నాడు. బిడ్డ పుట్టిన ఆరు నెలల తర్వాత వ్యాధి లక్షణాలు బయట పడ్డాయని తల్లిదండ్రులు తెలిపారు.

శారీరక ఎదుగుదల లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్తే జన్యు లోపంతో అరుదైన స్పైనల్ మస్యులర్ అట్రోఫీ టైప్-2 వ్యాధి సోకినట్లు వైద్య పరీక్షలో వెల్లడయిందని, బాబు వైద్యం కోసం ఇప్పటి వరకు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశామని చెప్పారు. బిడ్డ ప్రాణాలు నిలబడాలంటే రూ.9 కోట్ల విలువైన ఇంజక్షన్ (జోల్గెన్స్మా) లేదా రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ (స్పిన్రజ) చేయించాలని వైద్యులు చెప్పారని తెలిపారు. ఇండోనేషియాలో ఈ వ్యాధికి ఇచ్చే ట్రయల్ ఇంజక్షన్ (వెసెమ్నీజోన్ థెరపీ) ఖరీదు రూ.కోటిన్నర ఉంటుందని, ఆర్థిక పరిస్థితి సరిగా లేక బాబుకు తాత్కాలిక ఉపశమనం కోసం రూ.15 వేలు విలువైన టానిక్ తాగిస్తున్నామని, ఒక్క టానిక్ 20 రోజులు వస్తుందని తెలిపారు. రెండేళ్ల తమ కుమారుడి చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం, దాతలు సహకరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story