- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి
వర్షాకాలంలో దోమల బెడదకు చెక్ పెట్టాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : వర్షాకాలంలో దోమల బెడదకు చెక్ పెట్టాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించేందుకు ఎంటమాలజీ సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ఎంటమాలజీ, శానిటేషన్ విభాగాల సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని, క్షేత్రస్థాయి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా శుక్రవారం ఎంఎంసి ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి , అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, జీహెచ్‌ఎంసీ మాజీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డా. ఆర్. రాంబాబు, సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవ్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ప్రొ. రెడ్యా నాయక్‌లు పాల్గొన్నారు.
సాంకేతిక శిక్షణలో భాగంగా ప్రొ. రెడ్యా నాయక్ దోమల జీవన చక్రం, అవి వృద్ధి చెందే ప్రదేశాలు, లార్వా అభివృద్ధి దశలు, దోమల కాట్ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై సమగ్రంగా వివరించారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, ఫైలేరియా వంటి వ్యాధులను నివారించేందుకు దోమల పెరిగే ప్రాంతాలను గుర్తించడం, లార్వా నియంత్రణ చర్యలు చేపట్టడం, నిల్వ నీటిని తొలగించడం, శాస్త్రీయ విధానాలతో వెక్టర్ కంట్రోల్ అమలు చేయడం వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. డా. ఆర్. రామ్ బాబు, మాధవ్ రెడ్డిలు దోమలపై నిఘా, ఫాగింగ్ నిర్వహణ, సమగ్ర వెక్టర్ మేనేజ్‌మెంట్, వర్షాకాలంలో క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యల ప్రాముఖ్యతపై తమ అనుభవాలను పంచుకున్నారు.
దోమల నివారణకు చేపట్టవలసిన కార్యక్రమాలు తెలియజేశారు. ఎలాంటి చర్యలు చేపడితే దోమలు పెరగవో వివరించారు. అనంతరం ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.., వర్షాకాలంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అన్ని విభాగాలు సమన్వయంతో, ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.కార్యక్రమం ముగింపులో దోమల నియంత్రణ, ప్రజల్లో అవగాహన పెంపు, క్షేత్రస్థాయిలో సమన్వయంతో చర్యలు చేపట్టి వెక్టర్-బోర్న్ వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు అధికారులు, సిబ్బంది కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.






