అందోల్‌లో గెలిచేదెవరు?

by Disha Web Desk 12 |
అందోల్‌లో గెలిచేదెవరు?
X

దిశ, అందోల్‌: అందోలు నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు నియోజకవర్గంలో ఎవరికి వారు పర్యటిస్తూ, ప్రజల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా అధికార పార్టీకి చెందిన క్రాంతి కిరణ్‌ ఉండగా, కాంగ్రెస్‌ తరఫున మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ, బీజేపీ నుంచి మాజీ మంత్రి పి.బాబూమోహన్‌ బరిలో నిలువనున్నారు. మరి గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న చర్చ మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నది.

సింగూరు ప్రాజెక్టు ఓట్లు ప్రధానం..

అందోల్ నియోజకవర్గ ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయ ఆధారిత రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు తలమానికంగా ఉన్న సింగూర్‌ ప్రాజెక్టు అందోలు నియోజకవర్గం పరిధిలోని పుల్కల్‌ మండలం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా అందోలు, పుల్కల్‌ మండలాలకు 40 వేల ఎకరాలకు సాగునీరును అందిస్తారు. 2003లో సింగూర్‌ జలాలను నియోజకవర్గానికి సేద్యానికి అందించాలన్న ప్రధాన డిమాండ్‌తో సీ.దామోదర్‌ 102 రోజుల పాటు జోగిపేటలో నిరాహార దీక్షను చేపట్టారు. అ తర్వాత 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సీఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కాలువల నిర్మాణం, భూసేకరణకు రూ.89.98 కోట్లు మంజూరు చేసి స్వయంగా పనులకు శంకుస్థాపన చేశారు. 2016–17 సంవత్సరంలో సింగూర్‌ జలాల కళ సాకారమైంది.మా హయాంలో జరిగిదంటూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటూ, ఆయకట్టు రైతులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

అత్మీయ సమ్మేళనంతో ప్రజల్లోకి బీఆర్‌ఎస్‌..

బీఆర్‌ఎస్‌ పార్టీ చేపడుతున్న అత్మీయ సమ్మేళనాలు వచ్చే ఎన్నికలకు పార్టీ ప్రచారానికి దోహదపడే విధంగా ఉంది. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ ఆధ్వర్యంలో మండలాల వారీగా సమావేశాలను నిర్వహించారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా, వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ సరఫరా, వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకేళ్లాలని వివరించాలని ఎమ్మెల్యే సూచిస్తున్నారు.

జూన్‌ 2వ తేదీ నుంచి జూన్‌ 21వ తేదీ వరకు నిర్వహించే దశాబ్ది రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలతో ప్రజల్లోకి వేళ్లేందుకు ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. ఇదిలా వుంటే నాయకుల మధ్య సమన్వయ లోపంతో ఏర్పడిన గ్రూపులు పార్టీని గందరగోళ పరిస్థితికి తీసుకొచ్చిందనే చెప్పవచ్చు. గతంలో అసమ్మతి నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నించగా, మేము ఇప్పుడు గుర్తుకొచ్చామా, గత ఎన్నికల్లో కష్టపడి పనిచేశాం, మాకేమి గుర్తింపునిచ్చారు, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయో పిలుస్తున్నారంటూ వారిపై ప్రశ్నల వర్షం కురిపించడంతో చేసేది లేక మౌనంగా వెనుదిరిగి నట్లు తెలుస్తోంది.

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ గ్రౌండ్‌ వర్క్‌..

ఈ సారి ఎన్నికల్లో ఏలాగైనా గెలువాలన్న సంకల్పంతో దామోదర్‌ రాజనర్సింహ ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందిస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రతిఓటర్‌ను టచ్‌ చేయాలని యోచిస్తున్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయి ముఖ్య నాయకులతో సంగారెడ్డిలోని ఆయన నివాసంలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి. ఈ సారి మన పార్టీ పరిస్థితి ఏట్లుందని, ఎన్నికల సమయంలో హామీనివ్వాల్సిన అంశాలేంటన్న విషయంపై అడిగి తెలుసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు తీసుకొవాల్సిన జాగ్రత్తలపై ఆరా తీస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో అసమ్మతి నాయకులు ఎవరేవరు ఉన్నారు. మన వైపు వస్తారా అన్నది తెలుసుకుంటున్నారు. ఇదిలావుండగా బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న అసంతృప్తి నాయకులు దామోదర్‌కు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

సందర్భాన్ని బట్టి పార్టీ మారాలని వారికి దామోదర్‌ సూచిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో దామోదర్, ఆయన కూతురు త్రిషలు వేర్వేరుగా పర్యటనలు చేస్తూ, ప్రజల బాగొగులను తెలుసుకుంటూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి దామోదర్‌ గెలుపు ఖాయమంటూ ప్రచారం జరుగుతున్నా, మరింతగా ప్రజల్లోకి వేళ్లాల్సిందేనని, నేరుగా ఓటర్లను కలవాలని, గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొవాలంటూ ద్వితీయ శ్రేణి నాయకులు దామోదర్‌కు చెబుతున్నట్లు తెలిసింది.

ఈ సారైనా గట్టిపోటీ ఇచ్చేనా?

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనున్న మాజీ మంత్రి పి.బాబూమోహన్‌ గట్టిపోటి ఇచ్చేనా అన్న సందేహం నెలకొంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే పోటీ ఉంటూ వచ్చింది. బీజేపీకి నియోజకవర్గంలో అనుకున్నంత క్యాడర్‌ లేకపోవడంతో ఆ పార్టీలకు గట్టిగా పోటీలో ఉండదనే చెప్పవచ్చు. అందోలుకు 1998లో జరిగిన ఉప ఎన్నికతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బాబుమోహన్‌ ప్రజల్లో తనదైన ముద్రను వేసుకున్నారు.

బీజేపీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు నియోజకవర్గానికి వచ్చి ఆ కార్యక్రమాలను మాత్రమే చేపడుతున్నారు. బాబుమోహన్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ది పనులను ప్రజల్లోకి తీసుకేళ్లే పనిలో పడ్డారు. అధికార పార్టీలో ఆసంతృప్తిగా నేతలతో టచ్‌లో ఉంటూ, ఈ సారి ఎన్నికల్లో తనకు సహకరించాలని అడుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన తనయుడు ఉదయ్‌బాబుమోహన్‌ కూడా ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఇదిలావుండగా బాబుమోహన్‌పై వ్యతిరేకంగా కొందరు నాయకులు వర్గంగా ఏర్పడ్డారు. బాబుమోహన్‌కు సహకరించేది లేదంటూ చెబుతున్నారు.


Next Story

Most Viewed