రాయిన్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతులు ఎప్పుడు చేస్తారు..!

by Taduka Kalyani |

రాయిన్‌పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వ, లో లెవల్ దెబ్బతిన్న ధోనికి తాత్కాలిక మరమ్మతులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు.

రాయిన్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతులు ఎప్పుడు చేస్తారు..!
X

దిశ, మెదక్ ప్రతినిధి : రాయిన్‌పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వ, లో లెవల్ దెబ్బతిన్న ధోనికి తాత్కాలిక మరమ్మతులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు సోమవారం మెదక్ కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాల కారణంగా మెదక్ మండలంలోని రాయిన్‌పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వ, లో లెవల్ ధోని కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,500 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ధోని దెబ్బతిని సంవత్సరం గడిచినా ప్రభుత్వం ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాయిన్‌పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వ ధోనికి తక్షణమే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. రాయిన్‌పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వ ద్వారా తిమ్మానగర్, మక్తా భూపతిపూర్, గుట్టకిందిపల్లి, శివాయిపల్లి, మల్కాపూర్ తండా, వెంకటాపూర్, కొంటూర్ గ్రామాల రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ఈ కాల్వ ద్వారా మెదక్ పట్టణ పరిధిలోని గోసముద్రం, పిట్లంబేస్, బంగ్లా చెరువులు కూడా నిండుతాయని వివరించారు. రాయిన్‌పల్లి ప్రాజెక్టు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి. జగపతి,కృష్ణారెడ్డి, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు అంజగౌడ్,మాజీ ఎంపీపీ కిష్టయ్య,మాజీ వైస్ ఎంపీపీ మార్గం. ఆంజనేయులు, పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు మాయ మల్లేశం, ఆర్.కే. శ్రీనివాస్, బీమరి కిషోర్, బీఆర్ఎస్ నాయకులు వివిధ గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story