సోషల్ మీడియా రీల్స్ లో అశ్లీల వీడియోలు.. కేంద్రం నిద్రపోతోందా అంటూ నెటిజన్ల ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2026-06-15 13:13:12  IST  )

యూజర్లను ఆకర్షించేందుకు కొన్ని యాప్‍లు సాఫ్ట్ పోర్న్ కంటెంట్‌ను వాడుతుండటంపై నెటిజన్లు, నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా రీల్స్ లో అశ్లీల వీడియోలు.. కేంద్రం నిద్రపోతోందా అంటూ నెటిజన్ల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయాక చాలా మందికి రీల్స్ చూడటం ప్రధాన వ్యాపకంగా మారిపోయింది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు రీల్స్ చూస్తున్న వారు అనేక మంది ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా అనేక మంది సోషల్ మీడియాలో రీల్స్ ను చూస్తూ కాలం కాలం సాగదీస్తున్నారు. ఈ క్రమంలో ఎంటర్‍టైన్‍మెంట్ పేరుతో పుట్టగొడుగుల్లా వచ్చిన యాప్‍లు ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని చెలరేగిపోతున్నాయి. తమ యాప్ డౌన్ లోడ్ లను పెంచుకునేందుకు అక్రమ మార్గంలో సాఫ్ట్ పోర్న్ ను జనాల మీదకు వదులుతున్నాయి. ఈ పరిస్థితిపై తాజాగా ఇంటర్నెట్ లో నెటిజన్లు మండిపడుతున్నారు.ఈ విషయంలో ‘స్టోరీ టీవీ’ అనే యాప్‍పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రధాన ఫ్లాట్ ఫామ్‍లపైనే ప్రత్యక్షం:

స్టోరీ టీవీ (Story TV) అనేది షార్ట్ డ్రామాలు,ఎపిసోడ్‌లను అందించే ప్రముఖ మొబైల్ స్ట్రీమింగ్ యాప్. రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, రివెంజ్, సస్పెన్స్, థ్రిల్లర్ వంటి ఆసక్తికరమైన ఎపిసోడ్‍లను అందిస్తున్న ఈ స్టోరీ టీవీ యాప్ అనుసరిస్తున్న మార్కెటింగ్ ధోరణులు ఇప్పుడు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా రీల్స్, వీడియో ఫీడ్స్ లో ఉన్నట్టుండి స్టోరీ టీవీ పేరుతో అశ్లీల కంటెంట్ వస్తోందనే ఫిర్యాదులు నెటిజన్ల నుంచి పెరిగిపోయాయి. సాప్ట్ పోర్న్ పేరుతో అశ్లీలత కంటెంట్‍ను ప్రసారం చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే గతంలో తాము ఎన్నడూ అలాంటి కంటెంట్ వీక్షించనప్పటికీ ప్రధానమైనవిగా చెలామణి అవుతున్న సోషల్ మీడియా యాప్ ఫీడ్ లోనే ఇలాంటివి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలు చూస్తున్న సమయంలోనూ అకస్మత్తుగా ప్రత్యక్షమవుతున్న ఈ అశ్లీలతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ పిల్లల మనస్తత్వాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కేంద్రం ఏం చేస్తోంది?:

ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం, సంబంధింత శాఖలు ఏం చేస్తున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం వాణిజ్య లాభాల కోసం అశ్లీలతను సాధారణీకరించడం (Normalizing obscenity) భారతీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు పెరిగిపోతున్నాయి. డిజిటల్ ఇండియాలో ఇలాంటి పద్ధతులు సరికావని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోడీకి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రస్తుత చట్టాలను, మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు. పిల్లల రక్షణ కోసం పనిచేసే ఎన్‌సీపీసీఆర్ (NCPCR) స్టోరీ టీవీ వంటి యాప్‌లపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story