ఆదివాసీలకు న్యాయం చేస్తాం..

by Taduka Kalyani |   (  Updated:2026-06-15 14:33:36  IST  )

ఇంద్రవెల్లి అమరుల త్యాగాలను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరవదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు.

ఆదివాసీలకు న్యాయం చేస్తాం..
X

దిశ,ఆదిలాబాద్ : ఇంద్రవెల్లి అమరుల త్యాగాలను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరవదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి పోరాటం ఆదివాసీల హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచిందన్నారు. బాయిబాట కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రక్షణ సేనలో ఆదివాసీల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, గిరిజనుల హక్కులు, అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 9 ఆదివాసీ తెగలను కలుపుకొని వారి సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ యువతకు ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం తెలంగాణ రక్షణ సేన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని పేర్కొన్న కవిత, ఆదివాసీలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆదివాసీ పెద్దలతో సమావేశాలు నిర్వహించి వారి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఇంద్రవెల్లి పర్యటన అనంతరం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని సందర్శించారు. ఆదివాసీల సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి నాగోబా దేవుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆదివాసీ పెద్దలు, నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. నాగోబా దేవుడిపై తనకు ప్రత్యేకమైన విశ్వాసం ఉందని కవిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రంగినేని శ్రీనివాస్, వేణుగోపాల్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story