- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాకొద్దు ఇలాంటి లైన్మెన్.. రైతులు ఆగ్రహం
వానాకాలం సీజన్‌లో వరి నాట్లు వేసే సమయంలో వర్షాలు కురవకపోవడంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు విద్యుత్ సమస్యలు మరింత కష్టాలను తెచ్చిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, దుబ్బాక: వానాకాలం సీజన్‌లో వరి నాట్లు వేసే సమయంలో వర్షాలు కురవకపోవడంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు విద్యుత్ సమస్యలు మరింత కష్టాలను తెచ్చిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదని రైతులు వాపోతున్నారు. గ్రామంలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు చెబుతున్నారు. దీంతో వ్యవసాయ బోరు మోటార్లు పనిచేయక వరి నాట్లకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. రాత్రింబవళ్లు గ్రామ లైన్‌మెన్ కోసం ఎదురుచూస్తూ ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో నారు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. హబ్షీపూర్ గ్రామానికి చెందిన విద్యుత్ లైన్‌మెన్ ప్రతిరోజూ రైతులకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు ఫోన్ చేసినా స్పందించడం లేదని, సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని పేర్కొన్నారు. లైన్‌మెన్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుండగా, విద్యుత్ శాఖ ఏఈకి మాత్రం ఫోన్ ఎలా కలుస్తుందని రైతులు ప్రశ్నించారు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో జరుగుతున్న ఆలస్యం కారణంగా పంటల దిగుబడిపై ప్రభావం పడటమే కాకుండా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ రైతులకు అందుబాటులో ఉండని సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని హబ్షీపూర్ గ్రామ రైతులు కోరుతున్నారు.






