బొర్గి గ్రామంలో పెళ్లింట విషాదం.. బోరు బావిలో పడి ముగ్గురు దుర్మరణం

by Kodari Anjali |   (  Updated:2026-05-05 13:40:31  IST  )

బోరు బావి వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు బాలికలు బావిలో పడి మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని బొర్గి గ్రామంలో జరిగింది.

బొర్గి గ్రామంలో పెళ్లింట విషాదం.. బోరు బావిలో పడి ముగ్గురు దుర్మరణం
X

దిశ, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని బొర్గి గ్రామంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. గ్రామ సమీపంలోని బోరు బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సావిత్రిబాయి తన ఇద్దరు కూతుళ్లు, బావ రాజు కూతురైన నందినితో కలిసి మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో గ్రామ సమీపంలోని బోరు బావి వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లారు. మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నందిని బోరుబావి నుండి బకెట్‌తో నీరు తీస్తున్న సమయంలో కాలుజారి బావిలోకి పడుతున్నప్పుడు పక్కనే ఉన్న నికిత పట్టుకోవడంతో ఇద్దరూ ఒకేసారి బావిలోకి జారిపోయారు. వారిని రక్షించేందుకు సావిత్రిబాయి వెంటనే బావిలోకి దూకింది. అయితే ముగ్గురూ బయటకు రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.

వెంటనే గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని..

ఈ సమయంలో పైన ఉన్న సావిత్రిబాయి చిన్న కూతురు శివాని కూడా బావిలోకి దిగే ప్రయత్నం చేస్తుండగా, బావిలో ఉన్న సావిత్రిబాయి “బావిలోకి దిగకు, గ్రామస్తులకు సమాచారం ఇవ్వు” అని చెప్పడంతో శివాని పరిగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. వెంటనే గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు తెలిపారు. మృతులను సావిత్రిబాయి (30), నికిత (13), నందిని (13)గా గుర్తించారు. సావిత్రిబాయి భర్త జాదవ్ పరశురాం హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. జాదవ్ పరశురాం తమ్ముడి పెళ్లి ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుండి బొర్గి గ్రామానికి వచ్చిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. నికిత మొగుడంపల్లి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతుండగా, నందిని సిర్గాపూర్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. నందిని తండ్రి రాజు కుటుంబ సభ్యులు పిట్లం ప్రాంతంలోని కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న సీఐ వెంకట్ రెడ్డి, ఎస్ఐ దుర్గారెడ్డి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story