ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం

by Taduka Kalyani |

రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని, ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని టీజీ ఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల రెడ్డి తెలిపారు.

ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం
X

దిశ, సంగారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని, ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని టీజీ ఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల రెడ్డి తెలిపారు. బుధవారం కొండాపూర్ మండల పరిధిలోని తేర్పోల్, ఎదురుగూడెం గ్రామాలలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనాలకు ఆమె భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల పక్షపాతి అని, మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రతి మహిళను ఆర్థికంగా బలంగా నిలబెట్టేందుకు డ్వాక్రా సంఘాల ద్వారా పావలా వడ్డీకే రుణాలు అందిస్తున్నామని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా సంఘాల సభ్యులకు ఇంద్రమ్మ చీరలు, మహిళల పేరుపై కొత్త రేషన్ కార్డులు, ఇల్లు లేని వారికి మహిళల పేరుమీదే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి విడతల వారీగా రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. గత పాలకుల మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కాలేదని, గత 10 సంవత్సరాల్లో గ్రామంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సర్పంచ్ సతీష్, కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశం గౌడ్, నర్సింలు, ప్రభుదాసు, అశోక్, గోపాల్‌తో పాటు పంచాయతీ సభ్యులు, ఐకెపి వీఓలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story