- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సంగారెడ్డి అర్బన్: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సొంత జిల్లా సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (Sangareddy Government General Hospital)లో కీలకమైన 2డీ-ఈకో సేవలు అందని ద్రాక్షలా మారాయి. నెలకు రూ.లక్షల్లో జీతం తీసుకుంటున్న కార్డియాలజిస్టు నిత్యం విధులకు గైర్హాజరవుతున్నా, అటెండెన్స్ రిజిస్టర్ లో మాత్రం ప్రతిరోజూ ఆయన సంతకాలు ఉండడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఈ ఆసుపత్రికి కార్డియాలజిస్ట్ ను నియమించారు. అయినప్పటికీ ఆయన విధులకు సక్రమంగా హాజరు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం ఒక రోగి ఆక్సిజన్ సిలిండర్ తో 2డీ-ఈకో స్కానింగ్ చేయించుకునేందుకు గంటల త్వరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కార్డియాలజిస్టు అందుబాటులో లేకపోవడంతో గత్యంతరం లేక ఈసీజీ టెక్నీషియన్ తోనే తాత్కాలికంగా స్కానింగ్ చేయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డాక్టర్ ఆసుపత్రికి రాకపోయినా అటెండెన్స్ రిజిస్టర్లో మాత్రం ఆయన సంతకం రోజూ ఉంటుంది. దీని వెనుక ఆసుపత్రి అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలతో వచ్చే పేద రోగులు 2డీ-ఈకో సేవల కోసం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సరైన వైద్యుడు లేకుండా టెక్నీషియన్ తో సేవలు చేయించడం రోగుల ప్రాణాలతో చెలగాటమే అవుతుందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్వయంగా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మంత్రి సొంత జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి అవకతవకలు జరగడం పట్ల విమర్శలు వస్తున్నాయి.






