భారీ వాహనాలు కొట్టేయడమే వారి టార్గెట్..

by Kodari Anjali |

భారీ వాహనాలను చోరీ చేసి వాటిని విడిభాగాలుగా స్క్రాప్ దుకాణాల ద్వారా విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడమే ఆ ముఠా సభ్యుల ప్రధాన టార్గెట్.

భారీ వాహనాలు కొట్టేయడమే వారి టార్గెట్..
X

దిశ, సంగారెడ్డి: భారీ వాహనాలను చోరీ చేసి వాటిని విడిభాగాలుగా స్క్రాప్ దుకాణాల ద్వారా విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడమే ఆ ముఠా సభ్యుల ప్రధాన టార్గెట్. తెలంగాణ, మహారాష్ట్ర. కర్ణాటక ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న 13 మంది ముఠా సభ్యులను సంగారెడ్డి జిల్లా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఒకచోట చోరీ మరోచోట అమ్మకం

కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఖుర్షీద్ అహమ్మద్ (53), చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహమ్మద్ జాఫర్ అలీ (55) వీరిద్దరూ భారీ వాహనాలను చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నదీమ్ ఖాన్, షేక్ అజాజ్, సయ్యద్ సయుద్, షేక్ నిజాం, మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇర్షాద్, గులాం రబ్బాని, సలావుద్దీన్, బాబా, మోహియిద్దీన్ షా, రేహాన్ అనే మరో పదకొండు మంది సభ్యులతో ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరందరూ కలిసి సంగారెడ్డి జిల్లా, కామారెడ్డి, నిజామాబాద్, కర్ణాటక, మహారాష్ట్రల్లో కలిపి ఇప్పటి వరకు 11 దొంగతనాలను చేశారు. తొంగిలించిన వాహనాలను ఒకచోట చోరీ చేసి మరోచోట స్క్రాప్ ద్వారా అమ్మడం వృత్తిగా పెట్టుకున్నారు. దీని ద్వారా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తమ దొంగతనాలను సాఫీగా చేయొచ్చని నిర్ణయించుకున్నారు.

త్వరలోనే వారిని కూడా పట్టుకుంటాం..

అయితే గత ఏప్రిల్ 11న నారాయణఖేడ్ నియోజకవర్గ మానూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక డీసీఎం చోరీ జరిగినట్లు జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన సీసీఎస్, ఇతర పోలీసు బృందం సభ్యులు ఈ అంతరాష్ట్ర ముఠా దొంగలను ఎట్టకేలకు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఒక టిప్పర్ వాహనంతో పాటు ఒక నాటు తుపాకీ, రెండు రౌండ్ల బుల్లెట్లు, ఒక ఎయిర్ గన్, రెండు కత్తులు, రూ.2 లక్షల నగదుతో పాటు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ పంకజ్ వెల్లడించారు. అయితే 13 మంది ముఠా సభ్యుల్లో పోలీసులు ఆరు మందిని అరెస్టు చేయగా మరో ఏడుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు శివకుమార్, ప్రసాద్ రావు శివకుమార్, ఎస్సై శ్రీకాంత్, నారాయణఖేడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు.

Next Story