ఆయిల్ ఫాం సాగు లక్ష్యం పూర్తి చేయాలి

by Taduka Kalyani |

ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని జిల్లా కలెక్టర్ కే హైమావతి అధికారులను ఆదేశించారు.

ఆయిల్ ఫాం సాగు లక్ష్యం పూర్తి చేయాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని జిల్లా కలెక్టర్ కే హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రోగ్రెస్–2026-27 సమీక్షా సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆయిల్ పామ్‌తో పాటు పండ్లు, పూలు, కూరగాయల మొక్కలను నాటడానికి కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఆర్గానిక్, సీజనల్ పండ్లు, ఆకు కూరల సాగు ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, వ్యవసాయ పథకాల ప్రయోజనాలను రైతులు కోల్పోకుండా సీఎస్‌ఈల సహకారంతో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫార్మర్ రిజిస్ట్రీ లేకపోవడం వల్ల రైతులు ఏవైనా ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోయినా, లేదా పంట సాగు చేయని రైతులకు లబ్ధి అందించినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా భవిష్యత్తులో తలెత్తే ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాలో ప్రతి వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పాండ్ల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీడ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న విత్తనాల నిల్వల వివరాలను ప్రజాప్రతినిధులకు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశం ముగింపులో దూల్మిట్ట, ఆకారం, బక్రీచెప్యాల, నంగునూరు, చిట్టాపూర్ గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, టీజీ ఆయిల్‌ఫెడ్ ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story