సేవా భావం మాయం.. పైసలు ఇచ్చినం గెలిచినం

by Batti.Sumithra |   (  Updated:2026-04-25 04:25:09  IST  )

అధికారులు, నాయకులు నేడు నయా ట్రెండ్‌లోకి వెళ్లిపోయారు.

సేవా భావం మాయం.. పైసలు ఇచ్చినం గెలిచినం
X

దిశ, ఝరాసంగం : అధికారులు, నాయకులు నేడు నయా ట్రెండ్‌లోకి వెళ్లిపోయారు. నాయకులు ఓట్లు అడిగే ముందు “ప్రజాసేవే లక్ష్యం” అంటూ మాటలు చెబుతారు. కానీ ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత “డబ్బులు ఇచ్చి గెలిచాం, ఇప్పుడు చేసేదేమీ లేదు” అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఉద్యోగంలో చేరే ముందు ప్రజలకు సేవ చేస్తామని ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు చేపడతారు. కానీ కొంతమంది మాత్రం బాధ్యతలను మరిచి వచ్చిన కాడికి దండుకొని, పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక కొంతమంది ప్రజాసంఘాల నాయకులు “ప్రజాసేవే ముఖ్యము” అని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే ప్రజాసేవ చేసిన దాఖలాలు అంతంత మాత్రమే కనిపిస్తున్నాయి.

మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరై ఫోటోలకు ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని ప్రచార ఆర్భాటమే తప్ప చేసేదేమీ లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతంలో గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, కార్యాలయాలు, బస్టాండు, వారాంతపు సంత, దేవాలయాలు, చర్చిలు, దర్గాల వద్ద వేసవికాలం వచ్చిందంటే చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. మారుతున్న కాలానుగుణంగా ఆయా ప్రాంతాల్లో చలివేంద్రాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం మండల కేంద్రంలో ఒకే చోట ఎంపీడీవో, ఎమ్మార్వో, ఐకెపీ, గ్రంథాలయం, విద్యుత్ ఉపకేంద్రం, ఉపాధి హామీ కార్యాలయం, పీఆర్ డివిజన్ కార్యాలయం ఒకే చోట ఉన్నప్పటికీ ఒక్కచోట కూడా ప్రజల కొరకు మంచినీటి సౌకర్యం, కనీస సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం వీరి సేవాభావం ఎలా ఉందో అర్థమయ్యేలా చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి ప్రధాన కూడళ్లలో, అవసరమైన చోట చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేశారు.

Next Story