సిద్దిపేటలో ది గోల్డెన్ థీవ్ ముఠా రెక్కీ..7 రోజులు రెండు లాడ్జిల్లో మకాం

by velandi.Saikiran |   (  Updated:2026-05-15 21:31:02  IST  )

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ జ్యువెలరీ షాపు దోపిడీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సిద్దిపేటలో ది గోల్డెన్ థీవ్ ముఠా రెక్కీ..7 రోజులు రెండు లాడ్జిల్లో మకాం
X

సిద్దిపేటలో ది గోల్డెన్ థీవ్ ముఠా రెక్కీ..

7 రోజులు రెండు లాడ్జిల్లో మకాం

జ్యువెలరీ షాపుల వద్ద రెక్కీ

పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి

ఉలికిపడ్డ పట్టణ వాసులు

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ జ్యువెలరీ షాపు దోపిడీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దోపిడీకి పాల్పడిన 'ది గోల్డెన్ థీవ్' ముఠాలోని ఐదుగురు సభ్యులు చోరీకి ముందు సిద్దిపేట పట్టణంలోని రెండు లాడ్జిల్లో ఏకంగా 7 రోజుల పాటు మకాం వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ సమయంలో ముఠా సభ్యులు పట్టణంలోని జ్యువెలరీ షాపుల వద్ద పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించినట్లు అధికారులు దర్యాప్తు సందర్భంగా గుర్తించినట్లు తెలుపడంతో సిద్దిపేట వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతర్ రాష్ట్ర నగల దొంగ దీ గోల్డెన్ థీవ్ గా పేరొందిన ముఠా నాయకుడు బీహార్ కు చెందిన సుభోద్ సింగ్ నలభైకి పైగా దొంగ తనం, దోపిడీ కేసుల్లో నిందితుడు. అతనికి వెస్ట్ బెంగాల్ కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీర్ సింగ్ తో జైలులో పరిచయం ఏర్పడింది. ఇరువురు కలిసి అనేక నేరాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం బీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుభోద్ సింగ్, ప్రధాన నిందితుడైన రఘునాథ్ కర్మాకర్ తో దోపిడి విషయం చెప్పి జైలు నుంచి ప్లాన్ వేశాడు. ఒకరికి మరొకరితో సంబంధం లేకుండా కొంత మంది నేరగాళ్లను ఎంపిక చేసుకున్నాడు.

ఎవ్వరికీ అనుమానం రాకుండా

ఒక సస్పెన్స్ త్రిల్లర్ మూవీని తలదన్నేలా ప్లాన్ చేసిన ముఠా సభ్యులు 5 గురు ఎవరికీ అనుమానం రాకుండా సిద్దిపేట పట్టణంలోని రెండు లాడ్జీల్లో 7 ఏడు రోజులు మకాం వేసినట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ సమయంలో ముఠా సభ్యులు పట్టణంలోని పలు ప్రధాన జ్యువెలరీ షాపుల వద్ద పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించారని అధికారులు తెలిపారు. సిద్దిపేటలో కూత వేటు దూరంలోనే ఏసీపీ కార్యాలయం, పోలీసు స్టేషన్ ఉండటం, పోలీసుల గస్తీ గమనించిన దొంగలు చోరీ ప్రణాళికను కరీంనగర్ కు మార్చుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

కేసు ఛేదన లో కీలకంగా మారిన సీసీ పుటేజ్

కరీంనగర్ జ్యువెలరీ షాపు దోపిడీ కేసు ఛేదనలో సిద్దిపేట పట్టణంలోని ఆ రెండు లాడ్జుల్లో సేకరించిన సీసీ పుటేజ్ కీలకంగా మారింది. ఆ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కొత్త వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించడంతో పాటుగా సీసీ కెమెరాలు పనిచేసేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Next Story