- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్..."లేని రోగానికి చికిత్స" కథనంపై స్పందన
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపూర్(బీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మహిళా రోగికి తప్పుడు వైద్య నివేదిక ఆధారంగా చికిత్స అందించిన ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పందించారు.

దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపూర్(బీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మహిళా రోగికి తప్పుడు వైద్య నివేదిక ఆధారంగా చికిత్స అందించిన ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నెల 16న గంగ్వార్ గ్రామానికి చెందిన ముత్తమ్మకు మరో మహిళకు సంబంధించిన రక్త పరీక్ష నివేదిక ఆధారంగా చికిత్స అందించడంతో ఆమె అస్వస్థతకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాన్ని పరిశీలించిన మంత్రి, రోగుల నివేదికలను సరిచూడకుండా చికిత్స ఎలా అందించారంటూ అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ఇటువంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా చూడాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం. నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించినట్లు తెలిసింది. ఈ ఘటనపై సీఎంవో కార్యాలయం సమగ్ర నివేదిక కోరిన నేపథ్యంలో సంబంధిత అధికారులు మిర్జాపూర్(బీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి నుంచి వివరాలు సేకరించారు. శుక్రవారం ఆసుపత్రిలో వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి, ముత్తమ్మకు నిర్వహించిన వైద్య పరీక్షలు, అందించిన చికిత్స, పంపిణీ చేసిన మందుల వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం.






