క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. కరేబియన్ దిగ్గజం గ్యారీ సోబర్స్ కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-17 16:02:32  IST  )

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్ సర్ సోబర్స్ తుదిశ్వాస విడిచారు.

క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. కరేబియన్ దిగ్గజం గ్యారీ సోబర్స్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్‌, వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ సర్ గ్యారీ సోబర్స్ (Sir Garry Sobers) కన్నుమూశారు. క్రికెట్ హిస్టరీలో అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడిగా గుర్తింపు పొందిన సోబర్స్ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1954 నుంచి 1974 వరకు వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గ్యారీ సోబర్స్, తన అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను నెలకొల్పారు. ఆయన వెస్టిండీస్ తరఫున 93 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 57.78 సగటుతో 8,032 పరుగులు చేశారు. ఇందులో 26 సెంచరీలు ఉన్నాయి. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ రాణించి 235 వికెట్లు పడగొట్టారు.

పాకిస్తాన్‌పై చారిత్రాత్మక ఇన్నింగ్స్..

1958లో పాకిస్తాన్‌పై ఆయన చేసిన 365 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ 36 ఏళ్లు పాటు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ప్రపంచ రికార్డుగా నిలిచింది. ఆ తర్వాత లారా (375) ఈ రికార్డును అధిగమించారు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి బ్యాటర్‌గా సోబర్స్ చరిత్ర సృష్టించారు. 1968లో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడుతూ గ్లామోర్గాన్ బౌలర్ మాల్కం నాష్ ఓవర్లో ఆయన ఈ ఘనత సాధించారు. క్రికెట్ రంగానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలకు గాను 1975లో బ్రిటన్ రాణి ఎలిజబెత్-II ఆయనకు ‘నైట్‌హుడ్’ బిరుదును ప్రదానం చేశారు. ఆయన మరణం క్రికెట్ ప్రపంచానికి ఎప్పటికీ తీరని లోటని ఐసీసీతో పాటు పలు దేశాల క్రికెట్ బోర్డులు నివాళులర్పించాయి.

Next Story