మైనర్ బాలికపై లైంగిక దాడి

by Ratna Kumari |

హాలియా మండలంలో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మైనర్ బాలికపై లైంగిక దాడి
X

దిశ, హాలియా : హాలియా మండలంలో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని కుపాష్‌పల్లి గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనలో కుపాష్‌పల్లి గ్రామానికి చెందిన ఆదిమల్ల అజయ్, గుడిపల్లి గ్రామానికి చెందిన బండారు అఖిల్‌పై ఆరోపణలు ఉన్నాయి.

కొద్ది రోజుల క్రితం బాలికకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్య పరీక్షల సందర్భంగా జరిగిన విషయాన్ని ఆమె వెల్లడించినట్లు సమాచారం. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాలికను నల్లగొండలోని భరోసా కేంద్రానికి తరలించి, కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తున్నట్లు హాలియా ఎస్‌ఐ బండి సాయి ప్రశాంత్ తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలను కూడా సేకరిస్తున్నామని పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story