- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీళ్లు అడిగితే చెప్పుతో కొడతా అంటారా.. ఆర్‌సీఓపై విద్యార్థుల తీవ్ర ఆరోపణలు
నీటి కోసం ప్రశ్నిస్తే సమాధానం బదులు బెదిరింపు ఎదురైందని పోగుళ్లపల్లి ఏకలవ్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

దిశ, కొత్తగూడ: గుక్కెడు మంచినీళ్ల కోసం గళమెత్తారు... సమస్య చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందని ఆశించారు... కానీ తమకు సమాధానం బదులు బెదిరింపు ఎదురైందని పోగుళ్లపల్లి ఏకలవ్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో తాగునీటి కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి నీరు లేదు.. స్నానానికి నీరు లేదు... నిత్యావసరాలకు కూడా నీరు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నట్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆర్‌సీఓ రత్నకుమారి పాఠశాలను సందర్శించి, తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ట్యాంకర్లతో సమస్య తీరదని, శాశ్వత పరిష్కారం కావాలని విద్యార్థులు కోరారు. అదే సమయంలో సమస్యను మరింత వివరించే ప్రయత్నం చేయగా, మీరు ఎవర్రా నన్ను అడగడానికి.. చెప్పుతో కొడతా అంటూ ఆర్‌సీఓ మాట్లాడారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సమస్య చెప్పుకున్న తమను అవమానించారని, భయపెట్టేలా వ్యవహరించారని వారు వాపోయారు. ఆవేదన వ్యక్తం చేసిన కొందరు విద్యార్థులు, ఇంట్లో మా అమ్మానాన్నలే మమ్మల్ని కొట్టలేదు. మీరు ఎవరు మమ్మల్ని కొడతామని అంటారు? మా సమస్య చెప్పుకోవడమే మా తప్పా? అంటూ కన్నీటి పర్యంతమైనట్లు సహవిద్యార్థులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. తాగునీటి సమస్యకు వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని, అలాగే తమతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్న అధికారిపై నిష్పాక్షిక విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






