మారనున్న కళాశాల రూపురేఖలు.. జగ్గారెడ్డి కీలక నిర్ణయం

by Kodari Anjali |

వెయ్యి మందికి సరిపడా అదనపు తరగతి గదులు కావాలని అరబిందో చైర్మెన్ నిత్యానంద రెడ్డిని జగ్గారెడ్డి కోరారు.

మారనున్న కళాశాల రూపురేఖలు.. జగ్గారెడ్డి కీలక నిర్ణయం
X

దిశ, సంగారెడ్డి: ఇటు రాజకీయ నాయకుడు, అటు ఓ బడా కంపెనీ పారిశ్రామికవేత్త ఇద్దరూ కలిసి కళాశాల రూపు రేఖలను మార్చేందుకు ముందుకు వచ్చారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో గతంలో అరబిందో ఫార్మా సహకారంతో రూ.6 కోట్లతో వెయ్యి మందికి సరిపడా రెండు అంతస్తుల భవనాన్ని జగ్గారెడ్డి కోరిక మేరకు నిర్మించి ఇచ్చింది. తాజాగా మరోసారి అదే కళాశాలలో మరో 17 అదనపు గదులు, ఒక ఆడిటోరియం షెడ్డు నిర్మించి ఇవ్వాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలో అరబిందో ఫార్మా చైర్మన్ నిత్యానంద రెడ్డిని కోరారు. వారి కోరిక మేరకు త్వరలోనే ఆ పనులను కూడా పూర్తిచేసి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం సంగారెడ్డి నియోజకవర్గ విద్యార్థులే కాకుండా నారాయణ్ ఖెడ్, వికారాబాద్, బాన్సువాడ, పరిగి, జహీరాబాద్‌ల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు.

కళాశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో..

ఇంకా డిమాండ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో అడ్మిషన్లు ఇవ్వలేకపొతున్నారు. ఇదే విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన జగ్గారెడ్డి వెంటనే అరబిందో చైర్మెన్ నిత్యానంద రెడ్డిని సంప్రదించారు. అవసరమైన సిఎస్సార్ నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. జగ్గారెడ్డి వినతి మేరకు అదనపు తరగతి గదులతో పాటు ఆడిటోరియం ఏర్పాటు చేసేందుకు అరబిందో ఫార్మా ముందుకు వచ్చింది. కళాశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో మూడు అంతస్తుల్లో అదనపు తరగతి గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, త్వరలో బిల్డింగ్ ప్లాన్, కావాల్సిన అనుమతులు తీసుకుంటామని అరబిందో ప్రతినిధులు వివరించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శితో పాటు పాజి అనంత కిషన్, నాయకులు సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్, శ్రీకాంత్ గౌడ్ లు పాల్గొన్నారు.

Next Story