వివాదాల్లో వైద్య శాఖ.. పర్యవేక్షణ లోపంతో సేవల్లో ఇబ్బందులు

by Ajay Maddhiboyina |

సంగారెడ్డి జిల్లాలో వైద్యశాఖలో పనిచేసే కొందరి అధికారుల తీరు, పర్యవేక్షణ లోపాలు, వైద్య సేవలు విస్తరించేలా చర్యలు తీసుకోవడంలో విఫలం అవడం ఇవన్నీ వెరసి ఆ శాఖ ఇప్పుడు వరుస వివాదా ల్లో నిలుస్తుంది.

వివాదాల్లో వైద్య శాఖ.. పర్యవేక్షణ లోపంతో సేవల్లో ఇబ్బందులు
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో వైద్యశాఖలో పనిచేసే కొందరి అధికారుల తీరు, పర్యవేక్షణ లోపాలు, వైద్య సేవలు విస్తరించేలా చర్యలు తీసుకోవడంలో విఫలం అవడం ఇవన్నీ వెరసి ఆ శాఖ ఇప్పుడు వరుస వివాదా ల్లో నిలుస్తుంది. సాక్షాత్తు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కేంద్రంలోనే ఇక్కడి వైద్యశాఖ అధికారుల తీరు, కొందరు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం ఊహించిన మంచి ఫలితాలు ఇక్కడ రావడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పర్యవేక్షణ లోపంతో సామాన్యులకు ఇబ్బందులు..

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో రోజు వందల సంఖ్యలో రోగులు ఇక్కడ చికిత్స చేయించుకునేందుకు వస్తుంటారు. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడ వైద్యం అందించే సిబ్బంది ఆసుపత్రి వచ్చిన వారికి వైద్య సేవలు ఇస్తున్నప్పటికీ, కొంతమంది సిబ్బంది చేస్తున్న నిర్లక్ష్యపు ధోరణి కారణంగా వారికి సేవలు అందడంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే జిల్లా ఆసుపత్రికి సంబంధించిన పర్యవేక్షకుడు ఎప్పటికప్పుడు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీటితోపాటు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని గుర్తించవలసిన బాధ్యత కూడా వారికే ఉంటుంది. కానీ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఒకరిని చూసి మరొకరు సిబ్బంది ఆసుపత్రికి వచ్చే రోగులతో ఇష్టా తీరున మాట్లాడడం సరిగా వైద్య సేవలు అందించకపోవడంతో ఆసుపత్రికి వచ్చే సామాన్య ప్రజల ఆగ్రహానికి లోనవుతుంది.

మాతా శిశు కేంద్రంలో పైసా వసూల్

ఇదిలా ఉంటే జిల్లా ఆసుపత్రిలో ఉన్న మాతా శిశు కేంద్రంలో రోజు పదులకుపైగా ఇక్కడ డెలివరీలు జరుగుతుంటాయి. అయితే ఇక్కడ పని చేస్తున్న కొంతమంది కింది స్థాయి స్టాప్, ఇతర సిబ్బంది డెలివరీ అనంతరం వారి బంధువుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు బాహాటంగానే బయటికి వస్తు న్నాయి. ఇష్టం కొద్ది ఇస్తే తీసుకోవాలే తప్ప కొంత మంది ఇక్కడ దౌర్జన్యంగా రేటు ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేయడం ఏమిటా అని అక్కడికి వచ్చే వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమస్యలను అన్నిటిని గాడిలో పెట్టాల్సిన అధికారులు చూసీ చూడక ఉండకపోవడంతో సిబ్బంది ఆడిందే ఆట పాడింది పాటలా మారుతుంది. ఇకపోతే కొద్ది రోజుల క్రితం ఇక్కడ జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడిగా మురళీకృష్ణను అధికారులు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల, సదుపాయాలపై సరైన పర్యవేక్షణ చేయలేదనే కారణంతో ఆయనను పక్కనపెట్టి తిరిగి ఆయన స్థానంలో గతంతో ఉన్న డాక్టర్ అని ల్ ను తిరిగి పర్యవేక్షకుడిగా తీసుకువచ్చారు.

వైద్య సేవలు విస్తరించాల్సిన అధికారులే..

జిల్లాలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇక్కడ నెలకు ఒకటి, రెండు దఫాలు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశాలు పెడుతున్నారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వారికి సలహాలు సూచనలను చేస్తున్నారు. కానీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యపు ధోరణి కారణంగా ఆశించిన ఫలితాలు రావడం లేదు. తాజాగా ఇక్కడ డిఎంహెచ్వో గా పని చేసిన వసంతరావు పై బదిలీ వేటు పడడమే ఇందుకు మరో కారణం. అప్పటి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉన్న సమయంలో ఆయన ఎలాంటి సమాచారం లేకుండానే వరుసగా సెలవులు పెట్టడం, ముఖ్యమైన మంత్రులు ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో తాజాగా ఆయనపై బదిలీ వేటు పడిందని ఇక్కడ అధికారులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నష్టపరిహారపు డబ్బులు అందించడంలో బాధితులను తెప్పించుకున్నారనే విషయంలో బదిలీపై వెళ్తున్న ఆయనను అదే జిల్లా కార్యాలయం ఎదుట నిలదీసిన సంఘటన జిల్లాలో తీవ్ర చర్చగా మారింది.

ఇప్పటికైనా అధికారుల తీరు మారుతుందా..

రోగులకు ఉచిత నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించే విధంగా జిల్లాకు అవసరమైన ఎన్నో నిధులను ఇస్తుంది. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్వయంగా ఆ నిధుల విడుదల కోసం కూడా ప్రత్యేక చర్యలీ తీసుకుంటున్నారు. కానీ కొందరు అధికారులు, అక్కడక్కడ కొంత సిబ్బంది చేస్తున్న నిర్లక్ష్యపు వ్యవహారాల కారణంగా ప్రభుత్వం ఆశించిన నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందడంలో లోటు కనిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరును మార్చుకొని ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

Next Story