యజ్ఞం లా ఎస్ఐఆర్.. నిరంతర పర్యవేక్షణ లో అధికార యంత్రాంగం

by Taduka Kalyani |

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా మార్చడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

యజ్ఞం లా ఎస్ఐఆర్.. నిరంతర పర్యవేక్షణ లో అధికార యంత్రాంగం
X

దిశ, రామచంద్రాపురం: భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా మార్చడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఓటర్ల జాబితాలో పేరు ఉండి, మరణించిన వారు, లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి, డబుల్ ఓటర్ల పేర్లను తొలగించడమే ప్రధాన ఉద్దేశంతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రామచంద్రాపురం మండలంలో 109 మంది బీఎల్ఓ లతో వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో అనేక సందేహాలు, ఇబ్బందులు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలోని ఆర్సీపురం పఠాన్ చేరులో వలస ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి నగర శివారు నియోజకవర్గాల్లో డబుల్ ఓట్లకు చెక్ పెట్టే ప్రక్రియతో నగర శివారు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటివరకు స్వగ్రామంలోనూ, ప్రస్తుతం నివసిస్తున్న పట్టణంలోనూ ఓటు కొనసాగించిన పలువురు ఇకపై తప్పనిసరిగా ఒకే చోట ఓటును కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. దీంతో రానున్న ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. మరోపక్క 2002 నాటి ఓటరు వివరాలను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ, ఆ కాలానికి చెందిన ఓటర్ల ఎపిక్ నంబర్ల వివరాలు మ్యాచ్ అవ్వక అప్లోడ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్పటి వివరాలను దరఖాస్తులో నమోదు చేయకపోతే భవిష్యత్తులో సమస్యలు ఉండవని అధికారులు చెబుతున్నప్పటికీ, ఆ వివరాలు అప్లికేషన్ ఫారం లో పొందుపరచడం గందరగోళానికి దారితీస్తోంది. అదే సమయంలో 2002 ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఏయే ప్రత్యామ్నాయ ఆధార పత్రాలు సమర్పించాలో కూడా అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్షేత్ర స్థాయిలో బీఎల్వోలకు తప్పని తిప్పలు..

మరోవైపు బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వోలు) ఒక్కొక్కరికి వెయ్యి నుండి 1400 వరకు దరఖాస్తుల స్వీకరణ, విచారణ కేటాయించడంతో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఒకవైపు అధికారుల ఒత్తిడి మరోవైపు సర్వేలో అందుబాటులో లేని ఓటర్లతో తిప్పలు తప్పడం లేదు. దీంతో గడువు లోగా వారి టార్గెట్ పూర్తి కాలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఫారం పంపిణీ దాదాపు పూర్తి అవుతున్నప్పటికీ డిజిటలైజేషన్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో నిర్దేశిత గడువులో విచారణ పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బూత్ లెవల్ ఏజెంట్ లతో కొంత ఊరట లభిస్తున్నప్పటికీ, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని ఇస్తే మరింత సులువు అవుతుందని అలాగే ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదులో బాధ్యతగా ప్రక్రియలో పాల్గొని సహకరిస్తే అనుకున్న లక్ష్యాన్ని గడువులోగా సాధిస్తామని పలువురు అధికారులు కోరుతున్నారు.

క్షేత్ర స్థాయి పరిశీలనలో కలెక్టర్..

ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయ పరుస్తూ బీఎల్ఓ లు సమర్థవంతంగా పనిచేసేలా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ తగిన సూచనలు ఇస్తున్నారు కలెక్టర్ ప్రతీక్ జైన్. ఇందులో భాగంగా మంగళవారం కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ సముదాయం లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ నిర్వహణ ను ఆయన స్వయంగా పరిశీలించి.. స్థానిక తహశీల్దార్ తో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి తెలుసుకుని తగిన సూచనలు ఇచ్చారు. బీఎల్ఓ లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్థానిక అధికారులు రోజు వారి సమీక్షలతో ప్రక్రియను సమర్థవంతంగా కొనసాగించాలని తెలిపారు.

ఆందోళన వద్దు.. ప్రతి ఒక్కరు ఓటు నమోదు లో పాల్గొనండి : ఎమ్మార్వో సరస్వతి

ఓటు తొలగిస్తారని ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్ ప్రక్రియలో విధిగా పాల్గొని తమ ఓటు నమోదు చేసుకోండి. ఇంటింటి సర్వే లో బీఎల్ఓ లకు సహకరిస్తూ సరైన విధంగా ఫారం నింపడం, డిజిటలైజేషన్ చేసుకోవడం తప్పనిసరి. మీ ఉద్యోగ రీత్యా సమయం లేక ఆఫ్‌లైన్‌లో వెయిట్ చేయకూడదనుకుంటే, నేరుగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ voter.eci.gov.inద్వారా కూడా సర్వే పూర్తి చేయవచ్చు. లేదా ECI/Voter Helpline App ద్వారా మొబైల్‌లోనే మీ వివరాలను వెరిఫై చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1950కు కాల్ చేసి సహాయం పొందవచ్చు.

Next Story