- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కలు, డ్రిప్ పరికరాల సరఫరా నిరంతరం కొనసాగుతోంది: మంత్రి తుమ్మల
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు నాటేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో మొక్కల కొరత లేకుండా చూడాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు నాటేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో మొక్కల కొరత లేకుండా చూడాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. జిల్లాల వారీగా అవసరమైన మొక్కల డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసి, నర్సరీల నుంచి సకాలంలో సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగులో డ్రిప్ ఇరిగేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పరికరాల సరఫరాలో కూడా ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. తయారీ సంస్థలు, సరఫరా సంస్థలు, అమలు సంస్థలతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ రైతులకు సకాలంలో డ్రిప్ వ్యవస్థలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనాలు రైతులకు ఆలస్యం కాకుండా అన్ని పరిపాలనా ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. మొక్కజొన్న రైతులు తమ పంటను విక్రయించిన తర్వాత చెల్లింపుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసి రైతుల ఖాతాల్లో సకాలంలో నగదు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, ఎక్కడైనా కొరత లేదా రవాణా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల విస్తృత నెట్‌వర్క్‌ను రైతు సేవలకు వినియోగించే అవకాశాలను అధ్యయనం చేయాలని, దీంతో రైతులకు మరింత చేరువలో ఎరువులు అందించడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కూడా కల్పించే విధంగా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు రైతు భరోసా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోందని, వాతావరణ శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకొని తొలి ప్రత్యామ్నాయ కార్యాచరణను జిల్లాల వారీగా సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచుతామని చెప్పారు.






