"జాతరకు ముస్తాబవుతున్న సిద్దేశ్వరుడు"

by Naveena |

సంగారెడ్డి జిల్లా కంగ్టి శివారులో విరాజిల్లిన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం, భక్తుల కోరికలు తీరే పవిత్ర శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

జాతరకు ముస్తాబవుతున్న సిద్దేశ్వరుడు
X

దిశ, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి శివారులో విరాజిల్లిన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం, భక్తుల కోరికలు తీరే పవిత్ర శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి సౌందర్యాన్ని ఒడిసి పట్టుకున్న ఈ దేవాలయం, తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తున్నది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పండితులు ‘మినీ కాశీ’గా కీర్తిస్తున్నారు.

ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి అనంతరం వచ్చే బుధవారం నుంచి ఐదు రోజుల పాటు శ్రీ సిద్దేశ్వర జాతర ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ ఏడాది జాతర ఏప్రిల్ 16న ప్రారంభమవుతోంది. ఐదు రోజుల పర్వదినాల్లో సుమారు మూడు లక్షల మంది భక్తులు పాల్గొంటారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది.

ఈ జాతరలో ముఖ్యాంశంగా, గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయం వద్ద అత్యంత వైభవంగా స్వామివారి రథోత్సవం జరుగనుంది. 108 కట్టెలతో నిర్వహించే అగ్నికుండ యజ్ఞం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. వేదకళశ ప్రతిష్ఠాపన, వేదపఠనం, ఊరేగింపులు, కట్టె పోతులు వంటి విశేష కార్యక్రమాలు కూడా జరుగనున్నాయి. రాత్రి సమయాల్లో భజనలు, హోమాలు, అన్నదానం నిర్వహించబడతాయి.

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా సంప్రదాయ కుస్తీ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. నిజామాబాద్, బోధన్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ప్రసిద్ధ మల్లయోధులు పాల్గొని ఉత్సాహభరిత పోరాటాలు అందిస్తారు. భక్తుల హర్షధ్వానాల మధ్య జరిగే ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయం అభివృద్ధి దిశగా వేగంగా పురోగమిస్తోంది. ధర్మశాలలు, నీటి సదుపాయాలు, రహదారులు మెరుగుపడుతున్నాయి. గత సంవత్సరం ఏకశిల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఏడాది ఆలయ పరిసరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆలయానికి ఉన్న 50 ఎకరాల భూమిని కంగ్టి గ్రామస్థులకు మాత్రమే కౌలుగా ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూరుతోంది.

*శ్రీ సిద్దేశ్వర జాతర ముఖ్య కార్యక్రమాలు*

ఏప్రిల్ 16: శికరోత్సవం

ఏప్రిల్ 17: శివభజనలు, మఠంలో అన్నదానం

ఏప్రిల్ 18:ఉదయం 4:00 – అగ్నిగుండ యజ్ఞం

సాయంత్రం 4:00 – ఐదు అంతస్థుల రథోత్సవం

ఏప్రిల్ 19: సంప్రదాయ కుస్తీ పోటీలు

ఏప్రిల్ 20: మహా జాతర – దేవస్థానం నుండి మఠం వరకు ఊరేగింపు

*శ్రీ సిద్దేశ్వర ఆలయానికి చేరుకునే మార్గం*

నారాయణఖేడ్ లేదా పిట్లం మీదుగా కంగ్టికి చేరవచ్చు. ఈ రెండు పట్టణాల నుండి ఆలయం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నారాయణఖేడ్, పిట్లం నుండి ప్రతి గంటకూ ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ప్రయాణ సమయం సుమారు 45 నిమిషాలు పడుతుంది. ఆటోలు, తూపాన్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంతాల భక్తులు ముందుగా పిట్లం చేరి అక్కడినుండి ఆలయానికి వెళ్లవచ్చు.

Next Story