‘పాఠశాలల అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత’: ఎమ్మెల్యే

by Kodari Anjali |

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా, పట్టుదలతో చదివితే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

‘పాఠశాలల అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత’: ఎమ్మెల్యే
X

దిశ, మిరుదొడ్డి: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా, పట్టుదలతో చదివితే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో ప్రభుత్వ విద్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 500కు పైగా మార్కులు సాధించిన మండలంలోని 90 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కష్టపడి చదివి అద్భుతమైన ఫలితాలు సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు విద్య బోధన చేస్తారని అన్నారు. విశాలమైన పాఠశాల ఆవరణం, ఉచిత విద్య, భోజనం, యూనిఫామ్స్, ఆట పాటలు వంటి సదుపాయాలు ఉంటాయి కావున, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయడం అందరి భాద్యత అని అన్నారు.

ధైర్యంగా ముందుకు సాగాలి..

విద్య ఒక్కటే కాదు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అన్ని రంగాల్లో కూడా రాణించి సమగ్ర అభివృద్ధి సాధించాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా, మార్కులు తక్కువ వచ్చినా నిరుత్సాహపడవద్దని, ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ధైర్యంగా ముందుకు సాగాలని ప్రోత్సహించారు. జీవితం ఒక్క పరీక్షతో నిర్ణయించబడదని, మరిన్ని అవకాశాలు ముందున్నాయని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని, సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమానికి ముందుకు వచ్చిన ప్రొఫెసర్ పెద్ది రాజు ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈవో ప్రవీణ్ బాబు, గ్రామ సర్పంచ్ మహేశ్వరి దేవరాజు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Next Story