శశిధర్ రెడ్డి జంప్.. ఆ రెండు పార్టీలు అలర్ట్!

by Disha Web Desk 7 |
శశిధర్ రెడ్డి జంప్.. ఆ రెండు పార్టీలు అలర్ట్!
X

కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన అద్భుతమైన ఫలితాలు ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్‌లో జోష్ నింపాయి. అంపశయ్యపై ఉన్న పార్టీకి పక్క రాష్ట్ర ఫలితాలు జీవం పోశాయి. కొద్ది రోజుల క్రితమే బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తన మనసు మార్చుకుని తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయాడు. ఈ ఊహించని పరిణామంతో బీజేపీ నేతలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆయన చేరిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనే కాదు ఉమ్మడి మెదక్ జిల్లాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు తమ పార్టీలో చేరనున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రచారంతో ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అలర్ట్ అయ్యాయి. తమ పార్టీల నాయకులపై నిఘా పెట్టాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జంపింగ్‌ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, సంగారెడ్డి బ్యూరో: మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం బీజేపీకి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. కొంత కాలం క్రితమే ఆయన బీజేపీలో చేరారు. ఆయన చేరికతో మెదక్‌లో బీజేపీ బలపడుతుందని భావించారు. ఏమైందో తెలియదు కానీ శశిదర్ రెడ్డి మాత్రం బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీలో చేరినప్పటికీ అందులో ఎప్పుడూ ఆయన ఉత్సాహంగా కనిపించలేదు. చూస్తుండగానే ఎవరూ ఊహించని విధంగా ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత ఆయన కాంగ్రెస్ నేతల టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. పార్టీ ముఖ్య నాయకులు పిలుపు మేరకు ఆయన సంతోషంగా తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

శశిధర్ రెడ్డి బాటలో మరికొందరు..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకు ముందు వరకు ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వేగంగా పరిస్థితులు మారిపోవడం, బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగి పోవడం వెనువెంటనే జరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ హేమా హేమీలంతా మెదక్ జిల్లాలోనే ఉన్నప్పటికీ ఆ పార్టీ రోజురోజుకు పలుచబడుతూ వచ్చింది. ఇలాంటి తరుణంలో కర్నాటకలో కాంగ్రెస్‌కు అద్భతమైన ఫలితాలు రావడం, అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆ జోష్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపించింది. అయితే కాంగ్రెస్‌లో చేరికల సునామీ ఉంటుందని, మాజీ ఎమ్మెల్యే శశిదర్ రెడ్డితో మొదలయ్యిందని ఆ పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు చెప్పుకొచ్చారు. శశిదర్ రెడ్డి బాటలోనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆ నేత చెప్పారు. రోజుల వ్యవధిలోనే పార్టీల్లో వేగంగా పరిస్థితులు మారిపోతాయని ఆ నేత గట్టి ధీమాతో చెప్పడం గమనార్హం.

అప్రమత్తమైన ఆ రెండు పార్టీలు

శశిదర్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అప్రమత్తమయ్యాయి. మరికొంత మంది ముఖ్య నాయకులు ఆ రెండు పార్టీల నుంచి తమ పార్టీలో చేరనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంతో తీవ్ర చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ నాయకులతో ఎవరు టచ్ లోకి వెళుతున్నారు..? ఏ నాయకుడు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు..? గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన నాయకుల పరిస్థితి ఏమిటి..? ఇలా ప్రతి అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అధిష్టాన పెద్దలు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన ఎంతో మంది లీడర్లకు అందులో పదవులు రాకపోగా గుర్తింపు కూడా రాలేదు. అలాంటి నాయకులపై కాంగ్రెస్ దృష్టి సారించింది. తిరిగి పార్టీలోకి రండి కలిసి పనిచేసుకుందామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు కూడా. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నేరుగా చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఓ వైపు ఎవరూ పార్టీ మారకుండా ఆ రెండు పార్టీలు మరో వైపు తమ పార్టీలో చేర్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు వెరసీ ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయంగా రసవత్తరంగా మారింది. ఎప్పుడు ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి జంప్ అవుతారో..? ఏం జరగనున్నదోననే ఆసక్తి నెలకొన్నది.

Read more:

శశి రీ ఎంట్రీ.. మారనున్న మెదక్ రాజకీయ ముఖ చిత్రం!


Next Story

Most Viewed