- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త పాలన.. కోటి ఆశలు..!
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా చెప్పుకోవడానికి మాత్రమే తప్ప ఆచరణలో ఎక్కడా కూడా కనిపించడం లేదంటూ గతం నుంచి తీవ్రమైన ఆరోపణలు ఇక్కడ ప్రధానంగా ఉంది.

దిశ, సంగారెడ్డి : మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిపోయి కొత్తగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకార ఘట్టాలు కూడా ముగిసిపోయాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా చెప్పుకోవడానికి మాత్రమే తప్ప ఆచరణలో ఎక్కడా కూడా కనిపించడం లేదంటూ గతం నుంచి తీవ్రమైన ఆరోపణలు ఇక్కడ ప్రధానంగా ఉంది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, కంపు కొడుతున్న మోరీలు, గల్లీలో సరైన రోడ్ల వ్యవస్థ లేక ఇక్కడ ప్రజలు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తూనే ఉంది. గత పాలకులు చేసిన అభివృద్ధిని పక్కన పెడితే, అప్పుడు జరిగిన అభివృద్ధి కంటే ప్రస్తుతం సమస్యలే అధికంగా ఉన్నాయని ప్రజలు బాహటంగానే చెబుతున్నారు. అయితే ప్రతి వార్డుల్లో ప్రధానంగా మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయని ఆయా కాలనీల ప్రజలు చెబుతున్న అంశాలు. వీటితోపాటు సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డుల్లో ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. కొత్తగా చేపట్టిన నూతన పాలకవర్గం ఈ సమస్యలను ఎలా అధిగమిస్తుందో అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో మొదలైంది.
కలిసికట్టుగా వెళితేనే అభివృద్ధి..
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 38 వార్డులు ఉండగా ఇందులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 22 మంది కౌన్సిలర్లు మెజారిటీతో గెలుపొంది చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆ తర్వాతి స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, బీజేపీ, ఎంఐఎం పార్టీలు వారు ఉన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఒకే తాటిపై పని చేస్తే ఇక్కడ అభివృద్ధి సాధ్యపడుతుందని ప్రజలు, మేధావులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించుకున్న తమ వార్డు కౌన్సిలర్లు తమ కాలనీ అభివృద్ధికి ఏపాటి కృషి చేస్తారనే ప్రశ్న ఇప్పుడు వారిలో నెలకొన్నది. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఆయా వార్డుల ప్రజల నుంచి రోజూ పలు రకాల సమస్యలను వారి ముందు తీసుకువెళుతున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీనీ సర్వాంగంగా సుందరంగా తీర్చిదిద్దాలన్నా, అందుకు తగ్గ నిధులు రాబట్టడంలో చైర్మన్, వైస్ చైర్మన్లు కృషి ఎంతో చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే స్థానికంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా చింత ప్రభాకర్ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వారి ప్రభుత్వం లేకపోవడంతో నిధులు రాబట్టడంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే ఆవశక్యత ఉంటుందనే ఆలోచన ప్రజల్లో నెలకొన్నది. అటు చూస్తే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారంలో లేకున్నా కూడా తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డుకు రూ.8 కోట్లు చొప్పున నిధులు తీసుకొస్తానని మాట ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే స్థానిక ప్రజలు మాత్రం ఓటు వేసి గెలిపించుకున్న తమకు పార్టీ ఏదైనా సరే అల్టిమేట్ గా మాకు అభివృద్ధి పనులే ముఖ్యమని అన్ని వార్డుల ప్రజల నుంచి అభిప్రాయాలు స్పష్టంగా బయటికి వస్తున్నాయి. ఈ సమస్యలను అన్నింటినీ నూతన పాలకవర్గం ఎలా అధిగమించి ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.
అవినీతి కంపును కడుగుతారా..?
సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎక్కడపడితే అక్కడ అవినీతి కంపు పేరుకుపోయిందని స్థానికంగా ఎప్పటినుంచో తీవ్రమైన చర్చ జరుగుతూ వస్తుంది. ఏకంగా అక్కడ పని చేసే కొంతమంది సిబ్బంది సైతం ఈ విషయాన్ని చెప్పుకొని ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కొత్త ఇంటి నిర్మాణాలకు సంబంధించిన పర్మిషన్లు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు, ఇతర అనుమతుల కోసం కొంతమంది సిబ్బంది, రాజకీయ నాయకులు పెద్ద మొత్తంలో మామూళ్లనూ తీసుకుంటూ మున్సిపాలిటీ పేరును చెడగొడుతున్నారనే విమర్శ కూడా ఉంది. ఈ విమర్శను నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ఎలా పరిష్కరిస్తుందో కూడా వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది.
పెండింగ్ పనుల సంగతేంటి..?
సంగారెడ్డి పట్టణంలో రాజీవ్ పార్కు అభివృద్ధికి నోచుకోక మూలన పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పార్కు అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్ఎండిఏ అధికారులతో గతంలో మాట్లాడి నిధులను మంజూరు చేయించారు. ఇప్పటికైతే పార్కుకు సంబంధించిన పనులు ఇంకా మొదలు కాలేదు. దీంతోపాటు పట్టణంలో చాలా కాలనీలో కొన్ని పార్కులు అధ్వానంగా మారాయి. అలాగే చెరువు కట్ట వద్ద ఉన్న శిల్పారామం అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురైంది.
గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయా..?
సంగారెడ్డి పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారా అనే ప్రశ్న స్థానికుల నుంచి వస్తుంది. పట్టణంలో ఇప్పుడు నిర్మాణ దశలో నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ యార్డుతో పాటు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ప్రభుత్వ స్థలాలకు కాంపౌండ్ వాల్స్ వంటి ఇతర పనులను కూడా పూర్తి చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.
నేడే ప్రమాణ స్వీకారం..
సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ గా షాఫీలు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నెల 26న చైర్పర్సన్, వైస్ చైర్మన్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారం అనంతరం పూర్తిస్థాయి వారు బాధ్యతలు చేపట్టి ప్రజా సమస్యల కోసం పని చేయనున్నారు.






