- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సంగారెడ్డి బ్యూరో: పటాన్ చెరు నడిబొడ్డున రూ.300 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురికాబోతున్నది. ఆ భూమిని ఆక్రమించుకోవడానికి అక్రమార్కులు రాత్రికి రాత్రే కుట్రలు పన్నుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బుధవారం అర్థరాత్రి ఆ స్థలంలో ప్రొక్లైనర్లు, టిప్పర్లు, ఇతర వాహనాలు హంగామా సృష్టించి పలు నిర్మాణాలను కూల్చివేశాయి. గతంలో పటాన్ చెరు ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ స్కూల్ కు సంబంధించిన ఈ భూమిపై కోర్టులో కేసులు కూడా ఉన్నాయి. తమకు చెందినదేనని కొందరు కోర్టుకు వెళ్లగా ప్రభుత్వం ఆ భూమిని కాపాడుతూ వస్తున్నది. అయితే ఇటీవల ఆ భూమిని ఆక్రమించుకోవడానికి కొందరు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ భూమి ఆక్రమణకు గురికాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే..
బసవేశ్వరుని విగ్రహం పక్కనే
పటాన్ చెరు పట్టణంలోని బసవేశ్వరుని విగ్రహం పక్కన శ్రీనగర్ కాలనీకి వెళ్లే రోడ్డు మొదట్లోనే పాత జడ్పీహెచ్ఎస్ స్కూల్ కు సంబంధించిన సర్వే నెంబర్ 428లో దాదాపు 2.10 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడున్న స్కూల్ కు ఎంత చరిత్ర ఉన్నదని స్థానికులు చెబుతారు. ప్రస్తుతం పదవుల్లో ఉన్న ముఖ్యమైన రాజకీయనాయకులంతా ఇందులోనే చదివారంటున్నారు. స్కూల్ పాడుపడిపోవడంతో పూర్తిగా కూల్చేశారు. ప్రస్తుతం ఖాళీ ప్రదేశంగా ఉన్నది. ఇక్కడ ప్రస్తుత మార్కెట్ ప్రకారం గజానికి 3 లక్షల వరకు భూమికి ధర ఉన్నది. ఈ లెక్కన స్కూల్ భూమి రూ.300 కోట్ల ధర ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
కంపౌండ్ వేయించిన కలెక్టర్ స్మితా సబర్వాల్
విలువైన స్థలం కావడంతో చాలా కాలంగా ఈ భూమిపై పలువురి కన్నుపడినట్లు చెబుతారు. అయితే ఈ భూమి తమదేనని, పాత రికార్డుల్లో తమ పేరే ఉందని కొందరు కోర్డులకు వెళ్లారు. ఈ వ్యవహారం కోర్టుల పరిధిలో కొనసాగుతున్నది. కాగా కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురికావద్దని గతంలో సంగారెడ్డి కలెక్టర్ గా పనిచేసిన స్మితా సబర్వార్ స్థానికుల వినతితో భూమి చుట్టూ పకడ్బందీగా కాంపౌండ్ వేయించారని స్థానిక రాజకీయ నాయకులు చెబుతున్నారు.గోడ కట్టించడంతోనే భూమి కబ్జా కాకుండా ఉన్నదంటున్నారు. వందల కోట్ల విలువ చేసే భూమి కావడంతో స్థానికంగా అందరూ ఈ భూమిని చూస్తూనే వెళుతుంటారు. ఈ క్రమంలో ఈ మద్య అక్కడ కొందరు వ్యక్తులు కనిపిస్తుండడంతో ఆక్రమించుకునే కుట్రలు జరుగుతున్నాయని అనుమానిస్తున్నారు.
అర్థరాత్రి ప్రొక్లైనర్లు
బుధవారం అర్థరాత్రి ప్రభుత్వ స్కూల్ భూమిలో ప్రొక్లైనర్లు, టిప్పర్లు పనిచేయడం చూసి స్థానికులు షాక్ తిన్నారు. గ్రౌండ్ లోని ప్రభుత్వ ఆస్తులను కూల్చివేశారు. దీనితో ఎవరికి వారు అక్కడ పనిచేస్తున్న వాహనాల ఫోటోలు తీసి తెలిసిన వారికి పంపించారు. ఈ విషయం రాజకీయ నాయకుల వద్దకు కూడా చేరింది. వారు కూడా స్పందించి ఆ పరిసరాలకు వెళ్లి చూశారని, దీనితో ప్రొక్లైనర్లు పని నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. భూమిని ఆక్రమించుకోవడానికి చూసి నిర్మాణాలను కూల్చివేసిన వారిని అరెస్ట్ చేయాలని, పాఠశాల ఆవరణలో 9 గుంటల స్థలంలో వెలసిన గుడిసెలను తక్షణమే తొలగించాలని, కూల్చివేసిన రక్షణ గోడను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని రిటైర్డ్ హెడ్ మాస్టర్, టీఎస్ఈసీ రాష్ట్ర సహాధ్యక్షులు, టీపీ జేఏసీ జిల్లా కన్వీనర్ అశోక్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






